మూడు రాజధానుల అంశం లేకపోతే ఏపీ రాజకీయాల్లో విశాఖపట్నం పెద్దగా హైలైట్ అయ్యేది కాదనే చెప్పొచ్చు. జగన్ ప్రభుత్వం వచ్చాక, మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం అందులో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించడంతోనే అక్కడ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అయితే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌తోనే విశాఖలో టీడీపీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేయోచ్చని వైసీపీ భావించింది.

కానీ వైసీపీ అనుకున్నట్లుగా టీడీపీకి చెక్ ఏం పడలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రివర్స్‌లో ఇక్కడ వైసీపీకే కాస్త నెగిటివ్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే మూడు రాజధానులని ప్రకటించాక ఇక్కడ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు కాస్త ఇబ్బందికరంగానే ఉందని వివరిస్తున్నారు. మొదట రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడగలేదు కానీ, రాజధాని ప్రకటించి, ఇప్పటికీ అమలు చేయకపోవడం కాస్త మైనస్ అవుతుంది. ఇంకా వైసీపీకి రెండున్నర ఏళ్ళే సమయం ఉంది. మరి రాజధాని ఎప్పుడు పెడుతుందో, పెట్టిన దాని వల్ల విశాఖలో పెద్దగా మార్పులు వస్తాయో లేదో చెప్పలేని పరిస్తితి ఉందని అంటున్నారు.

రాజధాని పేరుతో విశాఖ భూముల్లో వైసీపీ నేతలు అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారశైలి కూడా వైసీపీకే మైనస్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రపై ఈయన పెత్తనం చేయడం సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదని చెబుతున్నారు.

ఇక విజయసాయిరెడ్డి అక్రమాలకు అంతు లేదని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అందుకే రివర్స్‌లో టీడీపీ నేతలపై విజయసాయి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. అటు అశోక్ గజపతి వ్యవహారం కూడా కాస్త వైసీపీకే మైనస్ అయ్యేలా కనిపిస్తోందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాజధాని వ్యవహారంతో టీడీపీకి చెక్ పెట్టాలనుకుని వైసీపీనే బొక్కబోర్లా పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అంటే విశాఖలో వైసీపీకి కొత్తగా ప్లస్ అయింది ఏమి లేదనే చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: