తెలంగాణలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం సవరించిన ధరలు ఈ రోజు అమలుల్లోకి వచ్చేశాయి. తెలంగాణ సర్కార్ పెంచిన మార్కెట్ విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. అటు రిజిస్ట్రేషన్‌లు కూడా కొత్త రేట్ల ప్రకారమే జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల విలువను మొత్తం మూడు శ్లాబులుగా విభజించింది ప్రభుత్వం. భూముల విలువ తక్కువగా ఉన్న చోట 50 శాతం, మధ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో 40 శాతం, ఎక్కువగా ఉన్న చోట మాత్రం 30 శాతం ధరలు పెంచింది టీ సర్కార్. రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచేసిన ప్రభుత్వం. కొత్త ధరలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ధరణి పోర్టల్‌లో కూడా మార్పులు చేసేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా కొత్త చార్జీల ప్రకారమే చెల్లింపులు చేసి... రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి.


వ్యవసాయ భూముల్లో సాగుబడిలో ఉన్న భూమి కనీస విలువను ఎకరాకు 75 వేల రూపాయలకు పెంచింది కేసీఆర్ సర్కార్. రియల్‌ ఎస్టేట్ రంగంలో కూడా భూముల విలువను పెంచేసింది. మొత్తం మూడు కేటగిరీలుగా పరిగణనలోకి తీసుకుని ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ ఫ్లాంట్‌ల ధరలు పెంచింది. పెంచిన ధరలతో ఓపెన్ ప్లాట్‌లో గజం ధర రెట్టింపు అయ్యింది. వంద రూపాయల నుంచి గజం 200 రూపాయలకు పెరిగింది. ఇక రూరల్ ఏరియాల్లో కనిష్టంగా గజం ధరను 200 రూపాయలు ఉన్న చోట 50 శాతం పెంచేసింది. దీంతో ఆ ప్రాంతాల్లో 300 రూపాయలకు పెరిగింది గజం ధర.

అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ ధరల్లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. లక్ష, లక్షకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించింది. దీని ప్రకారమే చదరపు అడుగు మార్కెట్ విలువ పెంచింది. లక్ష లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌కు కనీస చదరపు అడుగు రేటును 800 నుంచి వెయ్యి రూపాయలకు పెంచింది. లక్షకు పైగా జనాభా పట్టణాలు, నగరాల్లోని అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్‌ చదరపు అడుగు కనీస విలువను 800 నుంచి 1200 రూపాయలకు, హెచ్‌ఎండీఏ పరిధిలోని కనీస విలువను 1500 నుంచి 1700 రూపాయలకు, గ్రేటర్ హైదరాబాద్‌లో కనీస విలువను 1700 వందల నుంచి 2 వేల రూపాయలకు పెంచింది టీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: