జగన్ సర్కారు మరోసారి లబ్ది దారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయబోతోంది. నేడు వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను జగన్ విడుదల చేయబోతున్నారు. రెండో ఏడాది కాపు నేస్తం నిధులను సీఎం జగన్ స్వయంగా విడుదల చేయనున్నారు. ఈ పథకం ప్రకారం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నిధులు జమ కానున్నాయి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద మహిళలకు ఈ ఆర్థిక సాయం దక్కబోతోంది.


ఈ పథకం కింద లబ్ది పొందేందుకు 45 నుంచి 60 ఏళ్ల వయసును అర్హతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వయస్సులోని పేద మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. ఇవాళ అర్హులైన 3.27 లక్షలమంది మహిళలకు రూ.490 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. అయితే ఇలాంటి సాయం అందినప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉంటే.. వీటిని అందులో జమ చేసుకుంటున్నారు. అందుకే.. అలాంటి సమస్య రాకుండా పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో ఈ నగదు జమ చేయనున్నామని అధికారులు తెలిపారు.


అన్ని వర్గాలనూ ఆదుకుంటామన్న నినాదంతో జగన్ సర్కారు ఈ వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. జనాభాపరంగా ఆంధ్రాలో ఎక్కువగా ఉన్న కాపు కుల వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ పథకం తీసుకువచ్చారని చెప్పొచ్చు. ఆర్థికంగా వెనుకబడిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ పేద మహిళలకు ఈ పథకం ఓ వరంగా వైసీపీ నేతలు చెబుతుంటారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి న వెంటనే కాపు పేద మహిళలకు ఆపన్న హస్తం ప్రకటించారని గుర్తు చేస్తుంటారు. జగన్ సీఎం కాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెంటనే కసరత్తు చేయించారని చెబుతారు.


గత ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పేరిట పథకాన్ని తొలిసారి అమలు చేశారు. మొదటిసారిగా ఈ సామాజిక వర్గంలోని పేద మహిళల ముఖాల్లో నవ్వులు పూయించారు. ఇప్పుడు మరోసారి ఈ వర్గంలోని మహిళలకు ఆర్థిక సాయం అందించబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: