కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే నిత్యావసరాల సరకుల పంపిణీ ఏపీలో గందరగోళంగా మారింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ వాహనాల ద్వారా సరకులు చేరవేస్తోంది. ఈ క్రమంలో అదే వాహనాల్లో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం కూడా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధపడ్డారు. అయితే కేంద్రం మాత్రం ఇక్కడో మెలిక పెట్టింది. ఏపీలో సరకులు ఇచ్చే వాహనాలపై సీఎం జగన్ ఫొటో ఉంటుంది. కేంద్రం ఇచ్చే ఉచిత సరకులు కూడా అదే వాహనంలో ఇస్తే.. ఆ క్రెడిట్ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందనేది వారి అనుమానం. అందుకే ఉచిత సరకుల్ని నేరుగా డీలర్ల ద్వారా పంపిణీ చేయాలనుకున్నారు. దానికి అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేశారు.

కేంద్రం ఉచిత సరకుల్ని ఇచ్చే వేళ, అన్ని రేషన్ షాపుల్లో మోదీ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా పెట్టారు. తహశీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో ఆఫీస్ ల వద్ద కూడా ఈ ఉచిత రేషన్ పబ్లిసిటీ పెంచారు. మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం సజావుగా సాగుతున్నా, ఏపీలో మాత్రం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని నెలలుగా రేషన్ డీలర్లు సరకుల పంపిణీ ఆపేశారు. ఈ క్రమంలో డీలర్లకు మరోసారి కేంద్ర ప్రభుత్వం పని కల్పించింది. రేషన్ పంపిణీ చేయాలని ఆదేశించింది.

దీంతో డీలర్లు కూడా తలపట్టుకున్నారు. గతంలో ఒకేరోజు 200మందికి పైగా రేషన్ ఇచ్చే డీలర్లు, ఇప్పుడు కనీసం 50మందికి కూడా ఇవ్వలేకపోతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి రేషన్ షాపుల వద్ద క్యూలైన్లలో ఉండలేక కూలబడుతున్నారు. ఈ రేషన్ ని కూడా పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్వర్ సమస్యలు కూడా రేషన్ పంపిణీ ఆలస్యానికి కారణం అవుతున్నాయి. ఇంటి వద్దకే రేషన్ బండి వస్తే.. సర్వర్ సమస్యలున్నా లబ్ధిదారులు గంటలతరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఉచిత రేషన్ కి ఇన్ని కష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: