ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న చైనా... ప్రకృతి కోపానికి గురైంది. భారీ వర్షాలు చైనాలో జల ప్రళయం సృష్టించాయి. అక్కడి రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌లో పలు నగరాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఎటు చూసినా నీరే... కార్లు అయితే పడవల మాదిరి తేలియాడుతున్నాయి. హెనన్‌ ప్రావిన్స్‌లో అన్ని వ్యవస్థలు కుండపోత వర్షాల కారణంగా కుప్పకూలిపోయాయి. నగరాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు చైనాపై పగబట్టాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా హెనన్‌ ప్రావిన్స్‌లో ఇప్పటి వరకు 25 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వందల సంఖ్యలో గల్లంతయినట్లు భావిస్తున్నారు. హెనన్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో 20 లక్షల మందికి పైగా బాధితులు వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

వరద పోటెత్తడంతో... వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బస్టాండ్‌లు, విమానాశ్రయా టర్మినల్స్‌లోకి వరద నీరు చేరింది. పలు చోట్ల డ్యామ్‌లకు, రిజర్వాయర్లకు గండ్లు పడ్డాయి. ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. హెనన్‌ ప్రాంతంలో సబ్‌వేలో వెళ్తున్న రైలును వరద నీరు ముంచెత్తడంతో... రైలులోనే 12 మంది మృతి చెందారు.  పలు చోట్ల ఇళ్లు కూలిపోవడం, కార్లు నీళ్లలో కొట్టుకుపోవడం వల్ల మరణాల సంఖ్య వందల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. తమ జీవిత కాలంలో ఇలాంటి భారీ వర్షాలు ఎన్నడూ చూడలేదని చైనీయులు భయపడుతున్నారు. వరదల కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మొత్తం 260 విమాన సర్వీసులను, 160 బుల్లెట్‌ రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరుతుండటంతో... యుచువాన్ కౌంటీలో దెబ్బదిన్న యిహెతన్ ఆనకట్టను చైనా సైన్యం పేల్చేసింది. మరో రెండు రోజుల పాటు భారీ  వర్షాలు తప్పవన్న చైనా వాతావరణ శాఖ హెచ్చరికలు అక్కడి ప్రజలను మరింత భయపెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: