రాష్ట్ర,కేంద్ర సర్వీసుల్లో కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత లేదా ముందుగానే తమ పదవులకు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి రావడం జరుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న గోరంట్ల మాధవ్ ఎన్నికలకు ముందు తన పదవిని వదులుకొని ఏకంగా హిందూపురం ఎంపీ గా విజయం సాధించారు. రాజ‌కీయాల్లో రావ‌డంతోనే ఆయ‌న ఎంపీ అయ్యి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. మరో పోలీసు అధికారి మ‌హ్మ‌ద్ ఇక్వాల్‌ సైతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన వైసిపి ఎమ్మెల్సీగా, హిందూపురం పార్టీ ఇన్ చార్జ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న రావెల కిషోర్ బాబు పండుల రవీంద్ర బాబు ఇద్దరు 2014 ఎన్నికలకు ముందు తమ పదవులు వదులుకొని టిడిపిలో జాయిన్ అయ్యారు.

ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల‌ కిషోర్ బాబు ఏకంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. రవీంద్ర బాబు అమలాపురం ఎంపీగా గెలిచారు. మారిన సమీకరణాల నేపథ్యంలో రవీంద్రబాబు వైసీపీలోకి జంప్ చేసి ఇక్కడ కూడా ఎమ్మెల్సీ గా ఎంపికయ్యారు. ఇక రావెల ప్ర‌స్తుతం బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. ఇలా ఎంతోమంది రాష్ట్ర , కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పోలీసు అధికారి సైతం వైసీపీ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనే మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.

మాజీ డిజిపి దినేష్ రెడ్డి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నాటి సమైక్యాంధ్రలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పదవి విరమణ అనంతరం కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న దినేష్ రెడ్డి మళ్లీ ఇప్పుడు వైసీపీలో యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ లో చేరితే ఏదైనా పదవి ఇస్తామని హామీ వస్తే ఆయన వైసీపీ కండువా కప్పి కొనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: