వైసీపీ నేతలు.. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. నిజానికి విశాఖ క్యాపిటల్ సిటీ అని వైసీపీ సర్కార్ ప్రతిపాదించేంతవరకూ కూడా రాజు గారి జోలికి ఎవరూ పోలేదు. ఆయన కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు. దానికి కారణాలు అనేకం. ఆయన పట్ల టీడీపీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపం చెంది గమ్మున ఉంటూ వస్తున్నారు. ఆయన మాన్సాస్ బాధ్యతలు ఏవో నిర్వహించుకుంటూ తన మానాన తాను ఉన్నారు. అయితే విశాఖ పాలనా రాజధాని కావడంతో వైసీపీ పెద్దల కన్ను సింహాచలం భూముల మీద పడింది అని చెబుతారు. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ కి కూడా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి.

దాంతో ఈ భూముల విషయంలోనే అసలు  వివాదాలు మొదలయ్యాయని చెబుతారు. విశాఖలో రాజధాని అంటే పెద్ద ఎత్తున భూములు అవసరం అవుతాయి. అశోక్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా న్యూట్రలే కానీ ఆయన దానికి మించి ఆయన  టీడీపీ నేత. గతంలో కూడా ప్రభుత్వాలు అవసరం అయినపుడు సింహాచలం  భూములు తీసుకుని వాటికి బదులుగా వేరే చోట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే టీడీపీకి, వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దాంతో పాటు అశోక్ వంటి నేత ఎటూ వైసీపీకి సహకరించరు అన్నది కూడా ఉంది.

దాంతో ఎవరిచ్చారో కానీ సలహా తెలియదు, మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ని మార్చేసి సంచయితను సడెన్ గా అక్కడ కూర్చోబెట్టారు. అయితే ట్రస్ట్ బైలాస్ కి అది విరుద్ధం కావడంతో కోర్టులో కొట్టేశారు. తిరిగి అశోక్ చైర్మన్ అయ్యారు. దాంతో ఇపుడు అశోక్ వర్సెస్ వైసీపీగా కధ సాగుతోంది. ఈ మధ్యలో విజయసాయిరెడ్డి అశోక్ మీద చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మెడికల్ కాలేజ్ పేరిట భూములు అమ్ముకున్నారని కూడా విమర్శిస్తున్నారు. ఇపుడు చూస్తే నాలుగేళ్ళ క్రితం విజయనగరంలో జరిగిన ఒక రైల్ ప్రమాదాన్ని కూడా ముందుకు తెచ్చి కేంద్రాన్ని తిరిగి దర్యాప్తు జరిపించమంటున్నారు. అలాగే జీతాలు రాలేదని మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు, ఈవోని నిలదీశారు. అశోక్ గజపతిరాజే ఉద్యోగులని రెచ్చగొట్టి, ఈవో మీదకు పంపారని ఆయనపై కేసు పెట్టారు.  మొత్తానికి చూస్తే టార్గెట్ అశోక్ అన్నది టీవీ సీరియల్ మాదిరిగా కధ సాగుతోంది. మరెన్ని చిత్రాలు చూడాలో ఏంటో అంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకం.


మరింత సమాచారం తెలుసుకోండి: