పార్టీ అధినేత అయినా, తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం గానీ, విడిపోవడం గానీ చేస్తారు. తన పార్టీకి ఎలా అయితే బెనిఫిట్ జరుగుతుందో అలా ముందుకెళ్తారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అలాగే ఎప్పుడు ముందుకెళుతుంటారు. ఈయన రాజకీయ జీవితంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు...అదేవిధంగా పొత్తు నుంచి బయటకొచ్చారు. ముఖ్యంగా ఈయన, బీజేపీతో ఎన్నిసార్లు కలిశారో, ఎన్నిసార్లు విడిపోయారో కూడా తెలిసిందే.

2014లో పొత్తు పెట్టుకుని, 2019 ఎన్నికల ముందు విడిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోయి, అధికారానికి దూరమయ్యాక బీజేపీకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. అలాగే తనతో ఎంతో సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలని బీజేపీలోకి పంపించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా పలు రకాలుగా బాబు, బీజేపీకి దగ్గరవ్వాలని చూశారని, కానీ బీజేపీ మాత్రం ఆయన్ని దగ్గరకు రానివ్వడం లేదని పలు కథనాలు వచ్చాయి.

అయితే ఈ సారి మాత్రం చంద్రబాబు, బీజేపీకి దగ్గరయ్యే ప్రసక్తి లేదని తెలుగు తమ్ముళ్ళు తెగేసి చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ ఎన్నిరకాలుగా టీడీపీని ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలుసని అంటున్నారు. అలాగే గత ఎన్నికల్లో వైసీపీతో కుమ్మకై టీడీపీని ఎలా దెబ్బకొట్టారో తెలుసని, ఇక ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయకుండా బీజేపీ ఏ విధంగా రాష్ట్రానికి చెడు చేస్తుందో కూడా అంతా చూస్తూనే ఉన్నారని చెబుతున్నారు.

పైగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, ఈ పరిస్తితుల్లో బీజీపీకి దూరం కావడం చంద్రబాబు అదృష్టమని టీడీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీకి మళ్ళీ బాబు దగ్గరవ్వాలని చూస్తున్నారని వస్తున్న కథనాలని సైతం వారు ఖండిస్తున్నారు. కొందరు కావాలనే బీజీపీకి దగ్గరవుతున్నారని చెప్పి, బాబుపై ఏపీ ప్రజలకు నెగిటివ్ వచ్చేలా చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా మళ్ళీ బీజేపీకైతే చంద్రబాబు దగ్గరవ్వడం జరగదని గట్టిగా చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: