ఏపీలో మంత్రివర్గంలో జరగబోయే మార్పులపై ఆసక్తికర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి జరిగే మంత్రివర్గ విస్తరణలో సీఎం జగన్‌ ఎవరికి షాక్ ఇచ్చి, ఎవరికి బంపర్ ఆఫర్ ఇస్తారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. అయితే జగన్ క్యాబినెట్ నుంచి సగంపైనే మంత్రులు బయటకు రావడం గ్యారెంటీ అని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే యువ మంత్రి, జగన్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం, క్యాబినెట్ నుంచి బయటకు వస్తారని సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.

జగన్‌ని ఎంతో అభిమానించే అనిల్ కుమార్ యాదవ్, గత రెండు పర్యాయాలుగా నెల్లూరు సిటీ నుంచి విజయం సాధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2014లో అనిల్ మంచి మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోనే ఉండటంతో, జగన్‌కు అండగా నిలబడటంలో అనిల్ ముందు ఉండేవారు. అలాగే జగన్‌ని ప్రత్యర్ధులు ఏమన్నా అంటే చాలు, అనిల్ కుమార్ వెంటనే రియాక్ట్ అవుతూ, ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారు. అలా జగన్‌ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకునే అనిల్, 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో సీనియర్ ఎమ్మెల్యేలని సైతం పక్కనబెట్టి జగన్, అనిల్ కుమార్ యాదవ్‌ని మంత్రివర్గంలో తీసుకున్నారు. భారీ నీటి పారుదల శాఖ బాధ్యతలు అనిల్‌కు అప్పగించారు. అయితే మంత్రిగా అనిల్ బాగానే పనిచేస్తూ, అటు ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా క్యాబినెట్‌లో కీలకంగా ఉన్న అనిల్‌కు జగన్ షాక్ ఇస్తున్నారని, మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా టీడీపీ వాళ్ళు ఆడుతున్న మైండ్‌గేమ్ అని, అనిల్ కుమార్ ఐదేళ్ల పాటు మంత్రిగా జగన్ క్యాబినెట్‌లో కొనసాగుతారని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: