ఏపీ సీఎం జగన్ భావి ప్రధాని అంటూ వైసీపీ నేతలు పొగిడేస్తున్నారు. వినడానికి బాగానే ఉన్నా.. వైసీపీ స్ట్రాటజీ ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుందో అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఎంపీ స్థానాలు 25. ఒకవేళ వైసీపీ పాతిక స్థానాలూ గెలుచుకున్నా కేంద్రంలో చక్రం తిప్పగలదా? ఆ పార్టీ నాయకుడు ప్రధాని అవుతారా..? లాజిక్ కి అందని ప్రశ్నలివి. కనీసం పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా రాజకీయాలు చేయడం జగన్ కి ఇష్టంలేదు. ఈ దశలో ఆయన ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరిస్తారా..? ఎప్పటికీ ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోయే వైసీపీ నుంచి జగన్ ప్రధాని అవుతారా..?

మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఏ లాజిక్ తో మాట్లాడుతున్నారు. నాలుగు భాషలు మాట్లాడగలిగే ఏకైక సీఎం జగన్ అని, ప్రధాని అయ్యే స్థాయి ఆయనకు మాత్రమే ఉంది అంటూ నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్టేట్ మెంట్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. నాలుగు భాషలు మాట్లాడే జగన్ సీఎం అయితే.. నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన పార్టీలను నడుపుతున్నవారు ఏం కావాలి?

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారమైంది. భారత దేశానికి ప్రధాని అయ్యే అర్హతలు ఆయనకే ఉన్నాయంటూ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పినట్టు కూడా వార్తలొచ్చాయి. జగన్ సీఎం అయి జస్ట్ రెండేళ్లైంది. సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం వచ్చిందని అంటున్నారు కానీ, పూర్తి స్థాయి ఫలితాలు తేలేది మరికొన్నాళ్ల తర్వాతే. 2024నాటికి జగన్ పాలనపై జనాలకు పూర్తి అవగాహన వస్తుంది. అప్పటి వరకు వైసీపీ నేతలు ఆగకపోతే ఎలా..?

టీడీపీ ప్రచారం మొదలైంది..
వైసీపీ నేతలు జగన్ ని ప్రధానిగా పొగిడేస్తుంటే.. దాన్ని సోషల్ మీడియాలో టీడీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. దీంతో ఒకరకంగా బీజేపీకి కాలుతోంది. అటు కాంగ్రెస్ కూడా జగన్ టీమ్ చేస్తున్న వ్యాఖ్యలు చూసి విస్తుపోతోంది. భావి ప్రధానులు అంటూ ఎవరు ఎవరి గురించి పొగిడేసినా జాతీయ పార్టీలు ఓ కంట కనిపెడుతుంటాయి. గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పీఎం రేసులో ఉన్నారనే వ్యాఖ్యలు ఆయనకే చేటు తెచ్చాయి. పీఎం రేసులో నిలబడాలనుకున్న అభ్యర్థి కాస్తా.. సొంత రాష్ట్రంలో బీజేపీ చలవతో అధికారంలో ఉండాల్సిన పరిస్థితి. మరి వైసీపీ నేతలు ఎగిరెగిరి పడితే ఎవరికి నష్టం. జగన్ పాతికేళ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారనే మాటలు కూడా అతిశయోక్తి అనిపిస్తాయి, అలాంటిది జగన్ ని అప్పుడే భావి ప్రధానిగా కీర్తించడం కూడా కాస్త ఇబ్బందికర పరిణామమే. అవకాశం వస్తే జగన్ అయినా, లోకేష్ అయినా.. ఎవరైనా ఏ పదవిలో అయినా కూర్చోవచ్చు. అయితే ఆలోపు అత్యుత్సాహపడితేనే అసలుకే మోసం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: