జగన్ తన పార్టీ ఎంపీలను పార్లమెంట్ లో ముందు పెట్టి బీజేపీ మీద  ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. బీజేపీ నేతలు తట్టుకోలేని సీన్లు ఇపుడు ఉభయ సభల్లో కనిపిస్తున్నాయి. నిజానికి పార్లమెంట్ సమావేశాల దాకా కమలనాధులు అసలు ఊహించని దృశ్యం ఇది. వెల్ లోకి వెళ్ళి మరీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తూంటే ప్రధాని మోడీ మౌనంగా చూడాల్సి వచ్చింది. ఈ రోజు బీజేపీకి దేశమంతా ఎదురుగా ఉంది. కానీ నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న వైసీపీని కూడా దూరం చేసుకున్న పాపం అయితే అక్షరాలా మోడీ, అమిత్ షాలదే అని చెప్పాలి.  జగన్ ఏం చేయలేరు, ఏపీకి నిధులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు అన్న అతి ధీమాను కమలనాధులు ప్రదర్శించారు. దాని ఫలితమే ఇపుడు వైసీపీ ఎంపీల నిరసన.

దీంతో ఇపుడు బీజేపీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడంలేదుట. ఏపీ రాజకీయల‌లో మధ్యాహ్న మార్తాండుడిగా జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే సీఎం గా గెలవడం ఖాయమని అంటున్నారు. జగన్ ని  అత్యంత ప్రజాదరణ ఉంది. ఆయన్ని కాదనుకుంటే కేంద్రంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగే పని కాదని కూడా తెలుసు. ఇక ఏపీలో చంద్రబాబును నమ్మడానికి బీజేపీ తయారుగా లేదని కూడా అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే జగన్ కోపాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటే తప్ప పని జరగదు అని కమలనాధులు గ్రహించారు అంటున్నారు.

ఇప్పటికిపుడు ఏపీకి దండీగా నిధులు ఇవ్వడం అంటే కుదరదు, కానీ ఎంతో కొంత సాయం చేస్తారు. అలాగే ప్రత్యేక హోదా అన్న దాన్ని అసలు ముట్టుకోరు. అది ముగిసిన అధ్యాయం. అయితే బీజేపీకి పైసా కూడా ఖర్చు లేని పని ఒకటి ఉంది. అదే రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు మీద వేటు వేసి ఇంటికి పంపించేయడం. తమ కొంప మీదకు వస్తూంటే కూడా రాజును రక్షించాల్సిన అవసరం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారుట. నిజానికి రాజు విషయంలో ఆరెస్సెస్ పెద్దలు అండగా ఉన్నారని టాక్.

ఇపుడు బీజేపీ మాత్రం జగన్ని ప్రసన్నం చేసుకోవడానికి అర్జంటుగా రాజుని మాజీని చేసే పనిలో ఉందని టాక్. ఈ నెలాఖరులోగా రాజు నుంచి వివరణను స్పీకర్ కోరారు. అది అందిన వెంటనే అంటే ఆగస్ట్ మొదటి వారంలో రాజు గారు మాజీ అవుతారు అన్నది పచ్చి నిజం అని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అది జరిగితేనే జగన్ శాంతిస్తారు కాబట్టి బీజేపీ ఆ విధంగా ఆలోచిస్తోంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: