న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును పార్ల‌మెంటు నుంచి బ‌హిష్క‌రింప‌చేయ‌డానికి ఆ పార్టీ ఎంపీలు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయితే అవ‌నీ స‌ఫ‌లీకృతం కాక‌పోవ‌డంతో వారు ఇత‌ర మార్గాల‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తాజాగా ర‌ఘురామ‌కున్న విద్యుత్తు ప్లాంట్ల‌పై దృష్టిసారించారు. అవి ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి పిర్యాదు చేశారు.
 
ర‌ఘురామ ఆర్థిక మూలాల‌పై వైసీపీ దృష్టి
ర‌ఘురామకృష్ణరాజుపై పైచేయి సాధించాల‌ని చూస్తోన్న వైసీపీకి కాలం కలిసిరావ‌డంలేదు. దీంతో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు నెల‌వైన రాయ‌లసీమ‌లో ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్టాలంటే వారి ఆర్థిక మూలాల‌ను ధ్వంసం చేసే ప‌ద్ధ‌తిని ఎంచుకున్నారు. ర‌ఘురామ‌కున్న విద్యుత్తు ప్లాంట్లు ఇండ్ భార‌త్ పేరుతో ఉన్నాయి. ఇవి అనేక అక్ర‌మాలు చేశాయ‌ని, వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ రాష్ట్ర‌ప‌తికి, ప్ర‌ధానికి ఫిర్యాదు చేశారు. ఇండ్ భారత్ కంపెనీ రూ.940 కోట్ల మేర ప్రజాధనాన్ని దోచింద‌ని ఒక లేఖ పంపారు. ఆ లేఖ‌లో సంత‌కాలు చేసిన‌వారిలో 15 మంది ఎంపీలున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆర్థికంగా ఎదిగిన‌వారిలో రఘురామ కూడా ఒక‌రు. కేవీపీ రామ‌చంద్ర‌రావుకు ఆయ‌న స్వ‌యానా వియ్యంకుడు.  

రావ‌ల్సిన బ‌కాయిల కోసం బ్యాంకుల పోరాటం
ఈ కంపెనీల‌న్నీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించ‌లేద‌ని సీబీఐ కేసులు కూడా న‌మోద‌య్యాయి. వీటి గురించి విజ‌య‌సాయిరెడ్డికి పూర్తిగా అవ‌గాహ‌న ఉంది. ఎందుకంటే వాటిని అభివృద్ధి చేసే క్ర‌మంలో విజ‌య‌సాయి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ఈ కంపెనీల్లో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌న్నీ సీబీఐ ద‌ర్యాప్తులో బ‌య‌ట‌ప‌డటంతోపాటు కంపెనీ లా ట్రిబ్యునల్‌,  కోర్టుల్లోనూ కేసులు న‌డుస్తున్నాయి. త‌మ‌కు రావ‌ల్సిన బ‌కాయిల‌పై బ్యాంకులు కూడా ఇండ్‌భార‌త్‌పై పోరాటం చేస్తున్నాయి. ఇవ‌న్నీ గ‌తం నుంచి తెలిసిన అంశాలే అయిన‌ప్ప‌టికీ తాజాగా రాష్ట్ర‌ప‌తికి, ప్ర‌ధానికి లేఖ రాయ‌డంపై ర‌ఘురామ‌పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని వైసీపీ అవ‌లంబిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag