కోల్‌క‌తా నుంచి ఢిల్లీ వైపు త‌న రాజ‌కీయాన్ని దీదీ న‌డిపించ‌బోతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మరోసారి త‌న వ్యూహానికి పదును పెట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా దీదీని ఎన్నుకున్నారు.  2024లో ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వికి విప‌క్షాల త‌ర‌ఫున రేసులు ముందున్న మ‌మ‌త ఇక‌నుంచి కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టిసారించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీన్నిబ‌ట్టి బెంగాల్‌కు కొత్త ముఖ్య‌మంత్రిని నియ‌మించే అవ‌కాశం ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా వీటినే ధ్రువీక‌రిస్తున్నాయి.

పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపికైన మ‌మ‌తాబెన‌ర్జీ
తృణ‌మూల్ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయెన్ తెలిపారు. పార్లమెంటరీ పార్టీని ముందుకు న‌డిపించ‌డానికి, అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డానికి దీదీకి ఎంతో అనుభ‌వ‌ముంద‌ని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్ల‌డించారు. మమతా బెనర్జీకి లోక్‌స‌భ‌లోకానీ, రాజ్య‌స‌భ‌లోకానీ ఎటువంటి స‌భ్య‌త్వం లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆమెను చైర్‌ప‌ర్స‌న్‌గా ఎన్నుకోవ‌డం గ‌మ‌నార్హం. దీన్నిబ‌ట్టి ఇక‌నుంచి మ‌మ‌త ఢిల్లీలో చక్రం తిప్పుతారా అంటూ ఆనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌లైంది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్‌, ప్రధాని మోదీతో ఇత‌ర ప్రతిపక్ష నేతల‌తో ఆమె స‌మావేశ‌మ‌వ‌బోతున్నారు. దీనికి సంబంధించి ఆమె ఢిల్లీ ప‌ర్య‌ట‌న కూడా ఖ‌రారైంది.

ఉత్త‌రాఖండ్ ప‌రిణామంతో దీదీకి చెక్ పెట్టామంటున్న బీజేపీ?
ఉత్త‌రాఖండ్ ప‌రిణామాల‌తో దీదీకి చెక్‌పెట్టాల‌ని కేంద్రం భావించింది. ఈ ప్ర‌కారం మ‌రో నాలుగు నెలల్లో ఆమె ఎమ్మెల్యేగాకానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక‌వ్వాల్సి ఉంది. అయితే క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితులు బాగోలేద‌ని, ఎన్నిక‌లు నిర్వ‌హించే వాతావ‌ర‌ణం లేద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. అందుకే ఉత్త‌రాఖండ్‌లో కూడా త‌మ పార్టీ ముఖ్య‌మంత్రిని మార్చామ‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే దీదీపై పైచేయి సాధించ‌డానికే ఇదంతా అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆరునెల‌ల స‌మ‌యం ముగియ‌గానే త‌న ప‌ద‌వికి రాజీనామాచేసి ఒక‌టి, రెండు రోజుల స‌మ‌యం త‌ర్వాత మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యే అవ‌కాశం కూడా ఉంది. అయితే మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీని ముఖ్య‌మంత్రిగా నియ‌మించి కేంద్ర రాజ‌కీయాల‌పై దృష్టిసారించాల‌ని మ‌మ‌త నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ కొద్దిరోజులు ఆగితేకానీ ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

tag