జాతీయ స్థాయిలో వేడి చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా కూడా సమరోత్సాహంతో ప్రతిపక్షాలు దూకుడు మీద ఉన్నాయి. ఇక మమతా బెనర్జీ అయితే నేడో రేపో ప్రధాని పీఠం పట్టేస్తామన్నంత సంబరంతో తెగ‌ హడావుడి చేస్తున్నారు.

ఆమె హస్తినకు ఈసారి వస్తున్న తీరులో అదే కనిపిస్తోంది. ఆమె రాక పట్ల ఒక సానుకూల వాతావరణం కూడా విపక్షాల నుంచి కనిపిస్తోంది. ఒక వైపు చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణం అవుతున్న సీన్. ప్రతీ రోజూ సభలో విపక్షాల గందరగోళం మధ్య ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపధ్యలో ఆ వేడిని మరింతగా రాజేసేందుకు మమత వస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

మమత ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఇది అధికారిక కార్యక్రమం. ఆ తరువాత ఆమె కొన్ని రోజులు ఢిల్లీలో ఉంటారట. ఆమె విపక్షలతో చర్చలు జరుపుతారు అంటున్నారు. భావసారూప్యం ఉన్న పార్టీలతో మమత  భేటీ అవుతారు అంటున్నారు. అయితే ఏపీ నుంచి మాత్రం మమతకు సాయం అందడం లేదని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ బీజేపీ మీద ఈ మధ్య నిరసన గళం వినిపిస్తున్నారు. ఆయన తమ ఎంపీల ద్వారా పార్లమెంట్ లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అంతమాత్రం చేత ఆయన విపక్ష కూటమిలో ఉన్నట్లు లెక్క కాదని అంటున్నారు.

అదే విధంగా చంద్రబాబు విషయానికి వస్తే కంప్లీట్ సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన మోడీ మీద మూడేళ్ళ ముందున‌ ద్వజమెత్తారు, 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలను కూడా చూశారు. నాటి నుంచి ఆయన విపక్షాల కూటమి  జోలికి అసలు  పోవడం లేదు. దాంతో ప్రధాన పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నేతల వైఖరి ఏంటో తెలియక జాతీయ విపక్ష శిబిరం అయోమయంలో పడుతోంది. మొత్తానికి కలసి వచ్చే పార్టీలతో ప్రస్తుతానికి ముందుకు సాగాలని మమత ఆలోచిస్తున్నారు అంటున్నారు. మరి 2022 నాటికైనా ఏపీలో ప్రధాన  రాజకీయ పార్టీల  వైఖరి మారుతుందా. జాతీయ రాజకీయాలలో వైసీపీ, టీడీపీ పాత్ర ఏంటి అన్నదాని మీద క్లారిటీ వస్తుందా అంటే వేచి చూడాల్సిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: