పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా టీఎంసీ ఎంపీలు అందరూ ఎన్నుకున్నారు. మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనకు ఒకరోజు ముందు జరిగిన పరిణామంతో.. ఆమె జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్లు మమతా బెనర్జీ స్పష్టం చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకోసం రంగం సిద్ధం చేసుకోవడానికి, ప్రతిపక్షాల నేతలను కలిసి.. వారందరినీ ఐక్యం చేయడానికే.. ఆదివారం రోజున ఢిల్లీలో మమతా బెనర్జీ పర్యటించనున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రతిప‌క్షాల ఐక్యత మాట అటుంచితే.. ఆదిలోనే హంస‌పాదు అన్నట్లు ప్రధాని అభ్యర్థి ఎవ‌రు అన్నదానిపైనే ప్రధాన ప్రతిప‌క్షాలు భీష్మించుకున్నాయని తెలుస్తోంది.

అయితే ప్రధాని అభ్యర్థి అంశాన్ని ప‌క్కన పెట్టి ప్రస్తుతానికి ప్రతిప‌క్షాల నేతలు అంద‌రినీ  ఏక‌తాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీలో ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ తలమునకలు అయ్యారు. అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకే ప్రధానమంత్రి ప‌ద‌వి దక్కుతుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు.  ఇక ఆయన.. ఎన్నికల వ్యూహ‌క‌ర్త పాత్ర నుంచి వైదొల‌గి కాంగ్రెస్‌ పార్టీలో చేరాల‌ని కూడా భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరితే ఎన్నికల ఇన్‌ఛార్జిగా బాధ్యత‌ల‌ు అప్పగిస్తామ‌ని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రశాంత్‌ కిషోర్‌కు హామీ ఇచ్చిన‌ట్లు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇక మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ టూర్ విష‌యానికొస్తే... ప్రస్తుతం పార్లమెంటు స‌మావేశాలు కూడా జ‌రుగుతున్న నేప‌థ్యంలో కచ్చితంగా ఆమె ఢిల్లీ ప‌ర్యట‌న ప్రాధాన్యత‌ను సంత‌రించుకుంద‌నే చెప్పాలి. ప్రతిప‌క్ష నేత‌లంద‌రినీ క‌లిసి భారతీయ జనతా పార్టీని గ‌ద్దె దించాల్సిన ఆవ‌శ్యక‌త‌ను ఆమె అందరికీ వివ‌రించ‌నున్నారట. బెంగాల్‌లో త‌న‌ను అధికారం నుంచి ప‌క్కకు త‌ప్పించేందుకు కమలం పార్టీ ప‌న్నిన కుట్రల‌ను కూడా వివ‌రించి, ప్రతిప‌క్షాల ఐక్యత అనివార్యత‌ను ఆమె అందరికీ వివ‌రిస్తారట. రాబోయే రోజుల్లో ఆమె మ‌రిన్ని ఢిల్లీ ప‌ర్యట‌న‌లు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని టీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం  మ‌మ‌తా బెన‌ర్జీ ఎదుర్కొంటున్న స‌మ‌స్యల్లా ఒక‌టే. గ‌త ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ స్థానం నుంచి ఓడిపోయిన ఆమె మ‌ళ్లీ ఎన్నిక కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే ఆరు నెల‌ల్లోగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా భారతీయ జనతా పార్టీ అడ్డుప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్‌.. క‌రోనా మూడో వేవ్‌ను సాకుగా చూపి ఆరు నెల‌ల్లోగా ఉపఎన్నిక‌ జ‌ర‌ప‌క‌పోతే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల నేప‌థ్యంలో ఆరు నెల‌ల తర్వాత రాజీనామా చేసి మ‌రుస‌టి రోజు మ‌ళ్లీ సీఎం అయ్యేందుకు మ‌మ‌తా బెన‌ర్జీకి అవ‌కాశాలు లేవు. అందుకే ఎన్నికల క‌మిష‌న్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కూడా మ‌మ‌తా బెన‌ర్జీ త‌న ఢిల్లీ టూర్‌ను ఉప‌యోగించుకోబోతున్నారని సమాచారం. మరి మ‌మ‌త ఢిల్లీ టూర్‌ ఏ మేర‌కు సక్సెస్‌ అవుతుందో తెలుసుకోవాలంటే మ‌రికొంత కాలం వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: