కేసీఆర్ క్యాబినెట్ లోకి టీడీపీ ఎమ్మెల్యే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదేంటి కాస్త విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా ? కానీ త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళన లో టిడిపి నుంచి గెలిచి పార్టీ మారిన‌ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రివర్గంలో చోటు వస్తుందన్న ప్రచారం అయితే జరుగుతోంది. టిడిఎల్పి టీఆర్ఎస్ లో విలీనం చేయడంలో సండ్ర వెంకటవీరయ్య కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన కారు కు జై కొట్టారు. ఇక‌ ఆయన ఇటీవలే తెలంగాణలో టిడిపికి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావును ( అశ్వారావుపేట‌) సైతం గులాబీ గూటికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండాపోయారు. సండ్ర వెంకట వీరయ్య వివాదాలకు దూరంగా రాజకీయాలు చేస్తారని పేరుంది.

గతంలో పాలేరు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వీరయ్య... గత మూడు ట‌ర్మ్‌ల‌ నుంచి వరుస విజయాలు సాధిస్తూ హ్యాట్రిక్ కొట్టారు. మూడు ఎన్నికల్లో ఆయన స‌త్తుప‌ల్లిలో టిడిపి నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో 18 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఆయన తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీకి దూరమయ్యారు. సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారినప్పుడు కేసీఆర్ నుంచి మంత్రిని చేస్తానన్న హామీ ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ త్వరలోనే తన క్యాబినెట్ ప్రక్షాళన చేయనున్నారు.

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ స్థానంలోకి కొత్త మంత్రిని తీసుకోవడంతో పాటు క్యాబినెట్ నుంచి మంచి మార్కులు లేని ఇద్దరు ముగ్గురు మంత్రులను తప్పించి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ సామాజికవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య కు మంత్రి పదవి వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. కేటీఆర్ అడ్డు తగలకపోతే... చివర్లో సమీకరణ‌లు మారకపోతే కచ్చితంగా సండ్ర‌ కేసీఆర్ క్యాబినెట్ లో ఉంటారని టాక్. మరి సండ్ర‌కు మంత్రి పదవి యోగ్యం ఉందో లేదో ? రెండు మూడు నెలల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: