ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో మూడు నెలల్లో తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేయనున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలు ముగిసి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 25 మందితో తన క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. అయితే పార్టీ కోసం కష్టపడిన ఆశావహులు , సీనియర్లు ఎక్కువగా ఉండడంతో జగన్ వారిని సంతృప్తి పరిచేందుకు రెండున్న‌ర సంవ‌త్స‌రాల తర్వాత కేబినెట్ లో 90 శాతం మంది మంత్రులను మార్చే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఇక ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయి రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతోంది. వ‌చ్చే ద‌స‌రాకు కేబినెట్లో మార్పులు , చేర్పులు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో క్యాబినెట్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు ? కొత్తగా క్యాబినెట్లోకి ఎవరు వస్తారు ? అన్న దానిపై ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతున్నారు.

కమ్మ సామాజిక వర్గం నుంచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా కొడాలి నాని ఉన్నారు. జగన్ మ‌రోసారి కొడాలి నాని ని కంటిన్యూ చేస్తారా ? లేదా ఆయనను పక్కన పెట్టి మరో కమ్మ నేతకు అవకాశం ఇస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే గత ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట సీటు త్యాగం చేసిన పార్టీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ ని చేసి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు మర్రి రాజశేఖర్ కు ఇచ్చిన మాటను నెరవేర్చాలని అనుకుంటే జగన్ ఆయనను ఎమ్మెల్సీ ని చేయడంతో పాటు క్యాబినెట్ లోకి తీసుకోవాలి.

కొడాలి నాని మంత్రివర్గంలో ఉంటే టిడిపి , చంద్రబాబు , లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటారు. కొడాలి ఫైర్ బ్రాండ్ మినిస్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. కొడాలి నానిని కంటిన్యూ చేసి.. మ‌ర్రిని కూడా కేబినెట్లోకి తీసుకుంటే అప్పుడు జగన్ మంత్రివర్గంలో ఇద్దరు క‌మ్మ‌ నేతలు మంత్రులు గా ఉన్నట్టు అవుతుంది. ఒకవేళ ఒక్క క‌మ్మ నేత‌కే ఛాన్స్ ఇవ్వాలంటే మర్రి కోసం కొడాలి నానిని కూడా పక్కన పెట్టక తప్పదు. మరి ప్ర‌క్షాళ‌న‌లో కమ్మ మంత్రి విషయంలో జగన్ ఈక్వేషన్ లు ఎలా ? ఉంటాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: