మొసం చేయ‌డానికి కాదేది అన‌ర్హం అన్న‌ట్లు కొంద‌రు దేవుడి విష‌యంలో కూడా మోసానికి పాల్ప‌డుతున్నారు. క‌లియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలపై ఫిర్యాదులు అందాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రూ.300 ల‌కు టీటీడీ కల్యాణోత్సవం టికెట్లు బుక్ చేస్తామని మోసం చేసినట్లు ప‌లువురు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. టికెట్లు ఇస్తామని చెన్నైకి చెందిన రేవ‌తి ట్రావెల్స్ డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించింది.


దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు బుక్‌ చేసినట్లు అధికారులు వివ‌రించారు. tirupatibalaji.ap.gov.in ద్వారా ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో మాత్రమే టికెట్లు తీసుకోవాలని భక్తులు టీటీడీ సూచించింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా దర్శన టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.


ఆదివారం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా వేద పండితులు స్వామి వారికి పుష్పయాగం చేపట్టారు. పుష్ప‌యాగంలో భాగంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌హిత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామ్రుతం కొబ్బరి నీళ్లు, ప‌సుపు, చందనంల‌తో స్వామి వారిని విశేషంగా అభిషేకం చేశారు.


ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలోని మూలవిరాట్ ద‌గ్గ‌ర‌ ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభూపాల వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం నిర్వ‌హించారు.

అనంత‌రం ఆల‌య జెఈవో స‌దా భార్గ‌వి మాట్లాడుతూ జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జరిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల లేదా అధికార అనధికారుల వల్ల కానీ భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు క‌లిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌ని వివ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd