క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో అనేక ప‌రిణామాల త‌రువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప‌ద‌వికి య‌డ్డియుర‌ప్ప రాజీనామ చేశారు. య‌డ్డీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ అనూహ్య ప‌రిణామాల వ‌ల్ల బీజేపీ అధిష్టానం ఆయన్ను పదవి నుంచి తప్పించింది. పొంచి ఉన్న క‌రోనా మూడోదశ ముప్పు, యడ్డీ వ్యతిరేక వర్గం నుంచి వస్తున్న ఒత్తిడి, ఆయ‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్తు కార‌ణంగానే ఈ నిర్ణయాన్ని క‌మ‌ల ద‌ళప‌తులు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

   కర్ణాటకలో య‌డ్యూర‌ప్ప నాయ‌క‌త్వంలోని బీజేపీ ప్రభుత్వం జులై 26తో రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగు పెట్టనుంది. ఈ క్ర‌మంలో  రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమర్థమైన నాయకత్వం కోసం ఆ పార్టీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీని కోసమే క‌ర్ణాట‌క‌లో ప్ర‌త్యామ్న‌య నేత‌కు పాల‌నా ప‌గ్గాలు అందించాల‌ని బీజేపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. రాబోయే ఎన్నికల నాటికి నూతన నాయ‌కుని నేతృత్వంలో ప్రభుత్వంతో పాటు పార్టీని బ‌లోపేతం చేయాల‌నే ఆలోచ‌న‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.



ఇటీవల యడియూరప్ప త‌న కొడుకుతో పాటు  దిల్లీకి వెళ్లిన తక్షణమే య‌డ్డీని రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచించినట్లు విశ్వసనీయ వర్గాల స‌మాచారం. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే.. నాయకత్వ మార్పునకు వీలుప‌డ‌దు. 2023 మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రెండేండ్ల సమ‌యం ముందే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  య‌డ్డీ వయసు రాజీనామాకు మరో కారణంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం 78 సంవత్సరాలు ఉన్నయ‌డ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. పార్టీ నిబంధనల మేర‌కు 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి. కానీ, క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఎదుగుద‌ల‌కు కార‌ణం అయిన యడియూరప్పకు అధిష్ఠానం గౌరవాన్ని ఇచ్చింది.

   కుమారుడి భవిష్యత్తు కోసం కూడా  సీఎంగా యడియూరప్ప రాజీనామా చేశార‌ని తెలుస్తోంది. కర్ణాటక కేబినెట్లో ఆయ‌న‌ కుమారుడు విజయేంద్రకు కీలక పదవి దక్కనుందనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రకు ఉప ముఖ్యమంత్రి లేదా జలవనరులు, ఆర్థిక శాఖలో ఏదో ఒక మంత్రి పదవి వ‌రించే అవ‌కాశం ఉంది.



 ఇటీవల దిల్లీ పర్యటనలోనూ అధిష్ఠానంతో యడియూర‌ప్ప‌ తన కుమారుడి భవిష్యత్తు గురించే చర్చించారని తెలుస్తోంది. తన రాజీనామాకు బదులుగా విజయేంద్రకు ఉపముఖ్యమంత్రి పదవీ లేదా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని య‌డ్డీ కోరిన‌ట్టు స‌మాచారం. దీనికి బీజేపీ సానుకూలంగా స్పందించింద‌ని అందుకే య‌డ్డీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాడ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp