సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం సీఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ... సింగరేణిలో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపునకు  బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం తెలిపిందని ప్రకటించారు. పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు మార్చి 31వ తేదీ నుంచి అమలు కానుందని ఆయన తెలిపారు. మార్చి 31 నుంచి జూన్ 30వ తేది మధ్యలో దిగి పోయిన అధికారులు, కార్మికులకు తిరిగి ఉద్యోగాలు  ఇస్తున్నట్లు తీపి కబురు చెప్పారు సీఎండీ శ్రీ ఎన్.శ్రీధర్.

 బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం తో ఏకంగా 43, 899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు  సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు.  అయితే... అతి త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.  అలాగే.... పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకు కూడా కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటన చేశారు.   ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ అమలుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగ భేదం లేకుండా అవకాశానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు సీఎండీ ఎన్.శ్రీధర్. ఇది ఇలా ఉండగా.... ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌ రావు... సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి బోర్డు కూడా తాజాగా సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును పెంచుతూ... నిర్ణయం తీసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: