క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విశేష‌మేమైనా ఉందా? అంటే అది ఒక్క‌టే. ఆయ‌న ఏడుస్తూ రాజీనామా చేయ‌డం. అంతే.. ఆయ‌న ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ముందుగానే అధిష్టానంతో కుదిరిన ఒప్పందం మేర‌కే ఆయ‌న రెండు సంవ‌త్స‌రాలు పూర్తికాగానే రాజీనామా స‌మ‌ర్పించారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌రోజు ఏడుస్తూనే ఉన్నారు. ప‌ద‌వి మ‌ధ్య‌లో ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప‌ద‌వి నుంచి ఏడుస్తూనే దిగిపోతున్నారు. బీజేపీ అధిష్టానం ఆయ‌న‌కు ఏం ట్రాజెడీ సినిమా చూపించిందో తెలియ‌దుకానీ ఆయ‌న మాత్రం ప్ర‌జ‌ల‌కు మాత్రం ట్రాజెడీ చూపించారు.

ఏనాడూ సంతోషంగా లేను..!!
రెండు సంవ‌త్స‌రాల ప‌రిపాల‌నా కాలంలో తాను ఏనాడూ సంతోషంగా లేన‌ని య‌డ్డీ చెప్పారు. ఎన్నో అగ్నిప‌రీక్ష‌లు ఎదుర్కొన్నాన‌న్నారు. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత కూడా ఆయ‌న ఐదు సంవ‌త్స‌రాల పూర్తికాలం ఉండ‌లేక‌పోయారు. రెండు సంవ‌త్స‌రాల‌కే ముఖ్య‌మంత్రి పీఠం వీడాల్సి రావ‌డంపై ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. వాజ్‌పేయి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నార‌ని, కానీ క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల కోసం ఇక్క‌డే ఉండిపోవాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ రెండు సంవ‌త్స‌రాల నుంచి త‌న‌ను ఎంతో ప్రోత్స‌హించిన అధిష్టానానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. పార్టీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా య‌డ్డీ ప‌రిపాల‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. దిగిపొమ్మ‌న స‌మ‌యానికి ఆయ‌న దిగిపోయినందుకు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారా?  లేదంటే నిజంగానే ఆయ‌న రాజీనామా చేసినందుకు.. ఆయ‌న ప‌రిపాల‌పై ఆ జ‌ల్లులు కురిపించారా? అనేది న‌డ్డాకే తెలియాలి.

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య కూలిన ప్ర‌భుత్వం
క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్-జెడీఎస్ కూట‌మి అధికారం చేప‌ట్టిన కొన్నాళ్ల‌కే చోటుచేసుకున్న నాట‌కీయ‌ ప‌రిణామాల‌తో ఆ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. అనంత‌రం బీజేపీ అధికారం చేప‌ట్ట‌గా య‌డ్డీ ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. అప్పుడే అధిష్టానం, య‌డ్డీ మ‌ధ్య ఒప్పందం కుదిరింది. ఏనాడూ ఐదుసంవ‌త్స‌రాల పూర్తికాలం ఉండ‌క‌పోయిన‌ప్ప‌టికీ నాలుగుసార్లు చేసిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వీకాలం క‌లుపుకుంటే ఐదు సంవ‌త్స‌రాల రెండునెల‌లు మాత్రం ఆ ప‌ద‌విలో ఉన్నారు. త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎటువంటి అవినీతి మ‌ర‌క‌లేని ప్ర‌హ్లాద్‌జోషివైపు కేంద్ర పెద్ద‌లు మొగ్గుచూపుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

tag