మంత్రి గారు కనిపించడం లేదని ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో కూడా తెగ గుసగుసలాడుకుంటున్నారు. 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన విజయం సాధించిన వెల్లంపల్లి శ్రీనివాస్... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 2014 వరకు కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన వెల్లంపల్లి... విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వెల్లంపల్లి. నాటి నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉంటూ... తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరింత దగ్గరయ్యారు. జగన్ పాదయాత్ర సమయంలో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జగన్ కు నీరాజనాలు పట్టేలా ఏర్పాట్లు చేసి అందరి దృష్టి ఆకర్షించారు.

 ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో అదే పశ్చిమ నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. సమీకరణల్లో భాగంగా... అమాత్యపదవి కూడా దక్కింది వెల్లంపల్లి శ్రీనివాస్ కు. అయితే పదవి చేపట్టిన నాటి నుంచి ప్రతి రోజు కష్టాలే. దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెల్లంపల్లిపై తొలినాళ్లలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఈవో నియామకం ఎన్నో విమర్శలకు దారి తీసింది. అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత దేవస్థానం వెండి రథంపై ఉన్న సింహాల చోరీ వ్యవహారం చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇక అంతర్వేది ఆలయం రథం అగ్నికి పూర్తిగా కాలిపోవడం అయితే... పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత రామతీర్థంలో రాములోరి విగ్రహంపై దాడి అంశం వెల్లంపల్లికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. వీటికి తోడు బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారం ఇప్పటికీ చిక్కుముడిగా మిగిలిపోయింది.

ఆలయాలపై దాడుల విషయంలో వెల్లంపల్లి పూర్వపార్టీ బీజేపీ నేతలు మంత్రిగారినే టార్గెట్ చేశారు కూడా. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు రాబోయే రోజుల్లో మంత్రిపదవి ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న మల్లాది విష్ణును ఆ పదవి నుంచి తప్పించారు వైఎస్ జగన్. ఒకే నగరానికి ఇద్దరు మంత్రులు అసాధ్యం కాబట్టి.. వెల్లంపల్లి శ్రీనివాస్ కు పదవి గడం తప్పదనే పుకార్లు బలంగానే షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు నెల రోజులుగా వెల్లంపల్లి కనిపించడం లేదంటున్నారు. ఈ పుకార్లకు బలం చేకూర్చేలా... దుర్గమ్మకు ఏడాదిలో ఒకసారి నిర్వహించే శాకాంబరి దేవి అలంకరణ రోజుల్లో కనీసం దేవస్థానం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సో... వెల్లంపల్లి ఎగ్జిట్ కు సమయం ఆసన్నమైనట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: