తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు పథకం.. రాజకీయ లబ్ధి కోసమేననే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై దళిత-గిరిజన దండోరా మోగిస్తామంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 9వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి లక్ష మందితో దళిత-గిరిజన దండోరాను ప్రారంభిస్తామని వెల్లడించారు.

అయితే దళిత-గిరిజన దండోరాను ప్రారంభించేందుకు ఇంద్రవెల్లినే ఎందుకు ఎంచుకున్నారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంద్రవెల్లి  చారిత్రాత్మక ప్రాంతం. ఆదివాసులకు ఒక సెంటిమెంటు. ఈ గడ్డపై నుంచే ఆదివాసులు జల్- జంగల్- జమీన్ నినాదంతో ఉద్యమం చేశారు. 40 ఏళ్ల కిందట ఇక్కడ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆదివాసులు అసువులు బాశారు. నాటి రక్తపాతాన్ని మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా చెబుతుంటారు. ఆనాటి  అమరవీరుల స్మారకార్థం ఇక్కడ స్తూపాన్ని  నిర్మించుకున్నారు. అదే స్ఫూర్తితో నేటికీ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసుల్లో పట్టు పెంచుకునేందుకే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇంద్రవెల్లిని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. 2018లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇంద్రవెల్లి ప్రాంతంలో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇక హుజురాబాద్‌ ఎన్నికల కోసమే  దళిత బంధు తెస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా చెప్పిన నేపథ్యంలో ...అదే పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దళితులందరికీ వర్తింపజేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ తెరపైకి తెస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఆదివాసులు, దళితుల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తిని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునే దిశగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దళిత-గిరిజన దండోరా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: