పెగాస‌స్ నిఘా వ్య‌వ‌హారంపై దేశంలో రేగుతున్న దుమారం గ‌ట్టిగానే ఉంది. అయితే కేంద్రం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోను విచార‌ణ‌కు సిద్ధంగా లేమ‌ని ప‌రోక్షంగా చెబుతోంది. అన్ని వేళ్లు కేంద్ర ప్ర‌భుత్వంవైపే చూపిస్తున్న‌ప్ప‌టికీ ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అంద‌రికీ తెలుసు. అయితే దీనిపై కొంద‌రు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఈ కేసు ప‌లు కీల‌క మ‌లుపులు తిరిగే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ మాత్రం ఒక‌డుగు ముందుకే వేశారు. దీనిపై త‌మ ప్ర‌భుత్వం సొంతంగా విచార‌ణ చేప‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇద్ద‌రు మాజీ న్యాయ‌మూర్తుల‌తో క‌మిటీ
మ‌మతాబెన‌ర్జీ ప్ర‌త్యేకంగా కేబినెట్ భేటీ జ‌రిపారు. పెగాస‌స్‌పై విచార‌ణ‌కు ఇద్ద‌రు మాజీ న్యాయ‌మూర్తుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పెగాస‌స్‌పై ద‌ర్యాప్తు జ‌ర‌పాలంటే కేంద్రం అవ‌స‌రంలేద‌ని మ‌మ‌త స్ప‌ష్టం చేశారు. బెంగాల్‌కు చెందిన వ్య‌క్త‌ల‌పై కూడా నిఘా ఉందికాబ‌ట్టి త‌మ ప‌రిధిలో తాము ద‌ర్యాప్తు చేస్తామ‌ని దీదీ తెలిపారు. దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీతోపాటు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిషోర్‌తోపాటు మ‌రికొంత‌మంది బెంగాలీ నేత‌ల‌పైకూడా నిఘాపెట్టిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని కేంద్రం కొట్టిపారేస్తున్న‌ప్ప‌టికీ దీదీ మాత్రం సీరియ‌స్‌గానే తీసుకున్నారు. రాజ‌కీయంగా త‌న‌ను ఇరుకున‌పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోన్న కేంద్ర పెద్ద‌ల‌పై ఒత్తిడి పెంచాలంటే ఇది మంచి అవ‌కాశ‌మ‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వాల‌కు మాత్ర‌మే అమ్ముతాం
త‌మ సాఫ్ట్‌వేర్‌ను ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు విక్ర‌యించ‌మ‌ని, కేవ‌లం ప్ర‌భుత్వాల‌కే అమ్ముతామ‌ని ఇజ్రాయెల్ సంస్థ స్ప‌ష్టం చేస్తోంది. భార‌త‌దేశంలో ఎవ‌రిపైనైనా పెగాస‌స్‌ను ప్ర‌యోగించివుంటే అది క‌చ్చితంగా ప్ర‌భుత్వమేకావాలికానీ మ‌రో ఏ సంస్థా అవ‌ద‌ని చెబుతున్నారు. ఇది నిజ‌మే అయితే ప్ర‌యివేటు వ్య‌క్తులు, అత్యంత ముఖ్యులు, వీవీఐపీల‌పై కూడా ఇలాగే నిఘాపెట్టివుంటే క‌చ్చితంగా దేశ‌భ‌ద్ర‌త ప్ర‌మాదంలో ఉంద‌ని నిపుణులు అంటున్నారు. బెంగాల్ ప్ర‌భుత్వం చేయించ‌బోతున్న ద‌ర్యాప్తుల‌తో ఎటువంటి విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయోన‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి న‌రేంద్ర‌మోడీని ఇర‌కాటంలోకి నెట్టేలా మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇద్ద‌రిలో ఎవ‌రిది పై చేయి అవుతుందో చూడాలి మ‌రి..!!



మరింత సమాచారం తెలుసుకోండి:

tag