తెలుగుదేశం పార్టీకి గతమెంతో ఘనం. వర్తమానం ఇబ్బందికరం, భవిష్యత్తు అగమ్యగోచరం అన్నట్లుగా కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో టీడీపీ ఏర్పాటై నాలుగు దశాబ్దాల కాలం పూర్తి అవుతుంది. ఈ మధ్యలో 22 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించింది.

ఇక ఒకనాడు దేశంలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఇపుడు మాత్రం టీడీపీ గత వైభవమే చెప్పుకుంటోంది తప్ప రేపటి రోజు అంటే బెంగ పట్టుకునేలా సీన్ ఉంది. ఏపీలో 2019 ఎన్నికల తరువాత పొలిటికల్ గా  కనీసం ఊపిరి పీల్చుకునే వాతావరణం అంటూ ఏదీ కనిపించడంలేదు. ఏపీలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వైసీపీయే గెలుస్తోంది. అది కూడా అలా ఇలా కాదు, బంపర్ విక్టరీ కొడుతోంది. విజయం ఏకపక్షం అవుతోంది. ఏలూరు కార్పొరేషన్  అంటే పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి జిల్లాలు టీడీపీకి కంచు కోటలు.

అలాంటి చోట కార్పోరేషన్ కి ఎన్నికలు జరిగితే యాభై వార్డులకు కేవలం మూడు రావడం అంటే పార్టీ దైన్యాన్ని చాటి చెబుతోంది. ఎంత జగన్ పధకాలు, వైసీపీ  అధికారంలో ఉందని చెప్పుకున్నా కూడా పటిష్టమైన పార్టీ యంత్రాంగం విధేయులు అయిన నాయకులు, అంకితభావం కలిగిన కార్యకర్తలు కలిగిన ఒక పార్టీ ఇలా వరస ఎన్నికల్లో పతనం చెందడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరిగాయి అనుకున్నా కూడా అప్పటికి జగన్ పాలనకు ఇరవై నెలలు గడచిపోయాయి. మరి ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు అంటే అది జగన్ గొప్పదనమా లేక ప్రధానమైన విపక్షంగా టీడీపీ వైఫల్యమా అన్నది ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ఏదీ గొప్పది కాదు, ఈ రోజుకు ఇది అయితే రేపటికి మరోటి. మరి అలా వైసీపీ తప్పులను జనంలో ఎత్తి చూపి గట్టి ఆల్టర్నేషన్ గా టీడీపీ నిలబడలేకపోయిందా అన్నదే చర్చగా ఉందిపుడు. ఇకమీదట అయినా టీడీపీ రాజకీయ  దూకుడు చూపించకపోతే మాత్రం క్యాడర్ నిండా నిరాశలో మునుగుతారు. అది అసలైన డేంజర్ అన్న విశ్లేషణలు ఉన్నాయి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి:

tdp