ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కొద్దిసేప‌టి క్రితం మీడియాతో మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు సంబంధించి కొన్ని కీల‌క‌మైన సూచ‌న‌లు చేశారు. దీన్నిబ‌ట్టి వారంతా శాశ్వ‌త ఉద్యోగులా?  తాత్కాలిక ఉద్యోగులా? అనేది ఉద్యోగుల‌కే కాకుండా ప్ర‌భుత్వానికి కూడా ఎటువంటి స్ప‌ష్ట‌త లేద‌ని తేలింది. ప్ర‌భుత్వం క‌ల్పించిన లక్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగుల జాబ్‌చార్టులో వీరు కూడా ఉన్నారు. వీరంద‌రికీ నెల‌కు రూ.15వేల చొప్పున ప్ర‌భుత్వం చెల్లిస్తోంది.

ఐఏఎస్‌ల నుంచి ఎవ‌రైనా స‌రే..
ఐఏఎస్ నుంచి స‌చివాల‌యాల ఉద్యోగుల వ‌ర‌కు ఎవ‌రికైనా త‌మ ఉద్యోగం శాశ్వ‌త ఉద్యోగం కావాలంటే ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌లు రాస్తేనే వారి ఉద్యోగాలు నిలుస్తాయ‌ని చెప్పారు. దీన్నిబ‌ట్టి రెండుర‌కాల సూచ‌న‌ల‌ను స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు పంపించారు. ఒక‌టేంటంటే మీ ఉద్యోగాలు ఎక్క‌డికీ పోవు.. డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష పాసైతే ప్రొబేష‌న్‌లో ఉంటార‌ని చెప్పారు. అలాకాక‌పోతే ఇప్పుడున్న‌ట్లుగానే ఉద్యోగం చేసుకోవ‌చ్చ‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడారు. దీనికి సంబంధించి కొన్నిరోజులుగా ఉద్యోగుల్లో అల‌జడి నెల‌కొన‌డంతో ఈరోజు స‌జ్జ‌ల మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మ‌రీ స్ప‌ష్ట‌త ఇచ్చారు. దీనిని బ‌ట్టి ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం ఒక సందేశం పంపించింది. ప‌రీక్ష ఉత్తీర్ణుల‌వ‌క‌పోతే మిమ్మ‌ల్ని ప‌ర్మినెంట్ చేయ‌రు.. కానీ ఇప్పుడున్న‌ట్లుగా ప‌నిచేసుకోవ‌చ్చు అని. ప్ర‌తి విష‌యానికి ఇలా రెండ‌ర్థాలు తీయ‌డంపై స‌చివాల‌య ఉద్యోగులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌ర్మినెంట్ చేస్తామ‌ని చెప్పి..
రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత అంద‌రినీ ప‌ర్మినెంట్ చేస్తామ‌ని చెప్పి ఇప్పుడు మ‌ళ్లీ డిపార్ట్‌మెంట్ ప‌రీక్ష రాయాల‌ని, అందులో ఉత్తీర్ణులైన‌వారినే ప‌ర్మినెంట్ చేస్తామ‌ని చెబుతుండ‌టంపై ఎవ‌రికీ స్ప‌ష్ట‌త రావ‌డంలేదు. డిపార్ట్‌మెంట్ ప‌రీక్ష ఉత్తీర్ణులైన‌వారికి ఏవిధ‌మైన హోదా క‌ల్పిస్తారు?  వారికి ఏ విభాగాల్లో ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పిస్తారు? భ‌విష్య‌త్తులో వారిని ఏవిధంగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మార్చ‌బోతున్నార‌నేదానిపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. ప్ర‌స్తుతానికి ఏదో ఒక‌టి చేసేసి చేతులు దులుపుకుందామ‌నే యోచ‌నే ప్ర‌భుత్వంలో క‌న‌ప‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag