యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో జరిగిన రేషన్‌ కార్డుల పంపిణీ సభలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జగదీష్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి చేతిలోని మైక్‌ను ఎమ్మెల్యే లాక్కోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరి మధ్య పరస్పర దూషణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుందన్న సమయంలో పోలీసులు, మిగతా నాయకుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నుండి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాకౌట్ చేశారు.

రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంపై స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీష్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం కాదు, సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న జగదీష్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. సీఎం కేసీఆర్‌తో కొట్లాడైనా మునుగోడుకు నిధులు అందించాలన్నారు. లేదంటే తన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినా పరిస్థితి ఇలాగే ఉంటుందని మంత్రి జగదీష్‌రెడ్డికి ఆయన సవాల్‌ విసిరారు.

మరోవైపు మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఢీ అంటే ఢీ అన్నారు. "మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతా.. ఎలా ఆపుతావో చూస్తా.." అని రాజగోపాల్‌రెడ్డికి ఆయన ప్రతిసవాల్‌ విసిరారు. అంతకుముందు సభలో తన చేతిలోని మైకు లాక్కున్న ఎమ్మెల్యేపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిల్లరగానివిలా ప్రవర్తిస్తున్నావని ఆగ్రహించారు. ఏ పూటకు ఏ పార్టీలో ఉంటావో తెలియదు అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో అభివృద్ధి జరగడం ఇష్టం లేదనీ, అందుకే అభివృద్ధి కార్యక్రమాల్లో గొడవలు సృష్టిస్తున్నారనీ ధ్వజమెత్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను నాశనం చేసిందే కోమటిరెడ్డి బ్రదర్స్‌ అని మండిపడ్డారు. ఇలా ఇరువురి మధ్య పరస్పరం వాదనలు, దూషణలతో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రచ్చగా మారింది. అధికార టీఆర్ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: