ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు స్పందించారు. రహదారుల పరిస్థితి, అభివృద్ధిని ఆయన వివరించారు. రుతుపవనాల వర్షాల కారణంగా రాష్ట్ర రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి గత ఏడాది 220 కోట్ల రూపాయల బడ్జెట్‌ మాత్రమే ఉండగా.. ఈ ఏడాది ఆ నిధిని 932 కోట్ల రూపాయల వరకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. గతంలోని కొన్ని బిల్లులు మాత్రమే పెండింగ్‌లోని ఉన్నాయని తెలిపారు. రహదారుల మరమ్మతులు చేయాలంటే పెండింగ్‌లో ఉన్న 388 కోట్ల రూపాయల బిల్లులు క్లియర్‌ చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వెల్లడించారు.  ఈ బిల్లులను నెలవారీగా చెల్లిస్తామని కృష్ణబాబు స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో రహదారుల వార్షిక నిర్వహణ కోసం 160 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. విడతల వారీగా 40 వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్వహించాల్సి ఉందని వెల్లడించారు. 8,970 కిలోమీటర్ల మేర రహదారి మేర నిర్వహణ కోసం 2,205 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. నేరుగా బ్యాంకుల నుంచి బిల్లులు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. రహదారి అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా పెట్రోల్ , డీజిల్ సెస్ వసూలు చేస్తున్నామని చెప్పారు. ఈ నిధులు మరమ్మతులు, రహదారి నిర్వహణ కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు.

ఏపీలో 1,158 కోట్ల రూపాయలతో 99 రాష్ట్ర రహదారులు, 134 మేజర్‌ జిల్లాల రహదారుల అభివృద్ధి చేస్తామని కృష్ణబాబు తెలిపారు. 6,400 కోట్ల రూపాయలతో రహదారుల అనుసంధానం కోసం ఎన్‌డీబీ బ్యాంకు ద్వారా రుణ సమీకరణ చేస్తున్నామన్నారు. మొదటి విడతలో 2,970 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ప్రత్యేక బ్యాంకు ఖాతా పెట్టి  కాంట్రాక్టర్లకు నేరుగా చెల్లింపులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణబాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: