ఒడిశాలోని పూరి నగరం భారతదేశంలో మొట్టమొదటి 24 గంటలు కుళాయి నుండి నేరుగా సురక్షితమైన తాగునీటిని అందించే నగరంగా అవతరించింది. ఈ క్రమంలోనే పూరి న్యూయార్క్, లండన్ వంటి గ్లోబల్ మెట్రో పాలిటన్ నగరాల లిస్ట్ లో చేరింది. ఇది సురక్షితమైన తాగునీటిని కుళాయిల నుంచి నేరుగా అందిస్తుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘సుజల్’ డ్రింక్-ఫ్రమ్-ట్యాప్ మిషన్‌ లో భాగంగా పూరి ఈ ఘనతను సాధించింది. 24x7 డ్రింక్-ఫ్రమ్-ట్యాప్ ద్వారా వచ్చే నీటిని ఎటువంటి వడపోత అవసరం లేకుండా తాగడానికి, వంట చేయడానికి ఉపయోగించవచ్చు. 


నగరంలో నివసిస్తున్న 2.5 లక్షల మంది ప్రజలు, ప్రతి సంవత్సరం పూరిని సందర్శించే 2 కోట్ల మంది పర్యాటకులు ఈ కార్యక్రమం కారణంగా ఎంతో ప్రయోజనం పొందుతారు. ఇకపై పూరిలో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి మీరు బాటిల్ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండబోదు. జూలై 26 సోమవారం సీఎం పట్నాయక్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. దేశంలో “డ్రింక్-ఫ్రమ్-ట్యాప్ ప్రాజెక్టును అమలు చేసిన మొట్టమొదటి నగరంగా పూరి రికార్డులకు ఎక్కింది. 


ఇది నేడు ఒడిశా అభివృద్ధి చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూరిలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే ప్రయత్నంలో ఒడిశా ప్రభుత్వం నగరం అంతటా 400 వేర్వేరు ప్రదేశాలలో నీటి ఫౌంటైన్లు సైతం ఏర్పాటు చేసింది. సీఎం మాట్లాడుతూ నీటిని వృధా చేయవద్దని, కలుషితం చేయవద్దని ప్రజలను కోరారు. అలాగే ఐదేళ్లలో తాగునీటి బడ్జెట్ రెట్టింపు చేయబడింది. అంతకుముందు రూ .200 కోట్ల నీటి బడ్జెట్ ఈ రోజు రూ .4 వేల కోట్లకు చేరుకుంది. అని వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రతాప్ జెనా ప్రకారం రాష్ట్రంలోని 16 నగరాలకు 24x7 తాగునీటి శుభ్రమైన నీటిని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: