ఏపీలో గత ఎన్నికల్లో జగన్ పలువురు యువకులకు కొత్త నేతలకు ఎంపి, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేశారు. వారిలో ఒకరిద్దరు మినహా అందరూ విజయం సాధించి అసెంబ్లీలోనూ , పార్లమెంటులోనూ అడుగుపెట్టారు. అయితే ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడంతో వీరిలో 80 మంది నేతలు ప్రజాప్రతినిధులుగా తమదైన ముద్ర వేయటంలో విఫలమైనట్టు పార్టీ అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ఇప్పటి నుంచే పలువురు నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప‌ని  తీరు స‌క్ర‌మంగా లేక‌పోతే తాను ప్ర‌యార్టీ ఇవ్వ‌న‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కూడా రాద‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పలువురు నేతలకు షాక్‌లు  ఉంటాయని తెలుస్తోంది.

గత ఎన్నికలకు ముందు నుంచి వైసీపీలో ఓ సీనియర్ నేత హవా కొనసాగింది. ఆయన రాజ‌ధాని ప్రాంతంలో బ‌ల‌మైన ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. గ‌తంలో టీడీపీలో ప‌లు కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టే ఆ త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు. ఇక ఆయ‌న‌కు జగన్ ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. గత ఎన్నికలకు ముందు పార్టీ కోసం కష్టపడిన ఒక సీనియర్ నేతను కాదని.. ఆయన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆ నేత కూడా చావు తప్పి కన్ను లొట్ట పోయినంత చందంగా గెలిచారు. అయితే ఇప్పుడు సదరు అల్లుడు నియోజకవర్గంలో పార్టీని తీవ్రంగా భ్రష్టు పట్టిం చేశారన్న విమర్శలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గంలో అల్లుడి గారి దోపిడీ గిల్లుడు అయితే మామూలుగా లేద‌ట‌. సొంత పార్టీ నేతలకు కాకుండా కమీషన్లకు కక్కుర్తిపడి జనసేన - టీడీపీ నేతలతో చేతులు కలుపుతున్నారు అని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇవన్నీ నిజమే అని తేలడంతో సదరు ఎమ్మెల్యేపై జగన్ సైతం ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మామగారికి ఎమ్మెల్సీ రెన్యువ‌ల్ లేదంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో అల్లుడు గారి ఎమ్మెల్యే సీటు కూడా జగన్ కట్ చేస్తారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏదేమైనా అల్లుడు అవినీతి మామ సీటుకు కూడా ఎర్త్‌ పెట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: