రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవలే ఉప ఎన్నికల సంగ్రామం ముగిసింది. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సంచలన విజయం సాధించింది. ఇక ఏపీలో తిరుపతి లోక్‌స‌భ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు తమ సిట్టింగ్‌ సీట్లు నిలుపున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు నెలల్లో మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికల సమరం శంఖారావం పూరించేందుకు ముహూర్తం సిద్ధమవుతోంది. తెలంగాణలో రెండు నెలల క్రితం వరకు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది.

ఇదే సమయంలో ఏపీలో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతిచెందడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగనుంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ కు బ‌ద్వేల్ ఓట‌రు షాక్ ఇవ్వబోతున్న రా ? అన్న చర్చలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. బద్వేల్ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉంది. పైగా అక్కడ టిడిపి 1999 తర్వాత విజయం సాధించలేదు. గత ఎన్నికల్లోనూ వెంకటసుబ్బయ్య ఏకంగా 40 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ గెలుపుపై ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు.

అయితే ఇప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ వైసీపీ మెజార్టీ పడిపోతుందని వైసీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. బద్వేలులో టిడిపి గత నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోతున్నా ఆ పార్టీకి ప్రతి ఎన్నికల్లోనూ 50 వేల పైచిలుకు ఓట్లు వస్తున్నాయి. పైగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొనిరెడ్డి విజయమ్మ పార్టీకి మెయిన్ పిల్లర్ గా ఉన్నారు. కారణాలు ఏవైనా ఈసారి బద్వేలులో టిడిపి తన ఓటు బ్యాంకు పెంచుకుంటుందని స్థానికంగా చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో ఎస్సీ వర్గాలతో పాటు , బలిజ సామాజిక వర్గం ఓటర్లలో మార్పు వచ్చినట్లు కనబడుతోంది. ఇవన్నీ అధికార వైసిపికి ఓట్ల శాతంలో మైన‌స్‌ అవుతాయని అంటున్నారు. గెలుపు విషయంలో వైసీపీకి డౌట్‌ లేకపోయినా మెజార్టీతో మాత్రం జగన్ కు పెద్ద షాకే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: