రాష్ట్రంలో హుజురాబాద్ రాజ‌కీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆత్మ‌గౌరవం పేరుతో టీఆర్ ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి ఈటలకు దెబ్బ మీద దెబ్బ తాకుతోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం ఈటల రాజేంద‌ర్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్నవారిలో అనేక మంది ఆయనకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. 


ఇటీవ‌ల‌నే ఈట‌ట రాజేంద‌ర్‌ ప్రధాన అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్‌ పెద్ద షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన  ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీ‌నివాస్ విద్యార్ధి దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసి తనకంటూ ఒక నాయ‌కునిగా గుర్తింపును తెచ్చుకుని తన సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నాడు.  అయితే.. బండా శ్రీ‌నివాస్‌ ఈటలకు హ్యాండివ్వడం హుజురాబాద్ రాజ‌కీయాల్లో చర్చనీయాంశమైంది.

   ఇదిలా ఉండ‌గా నేడు ఈట‌లకు ముఖ్య అనుచరుడుగా వ్య‌వ‌హ‌రించిన‌ దేశిని కోటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న‌దేశిని కోటి భార్య దేశిని స్వప్న కూడా తాను టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ రోజు  ఉదయం విలేకరులకు ఓ ప్రకటన విడుదల చేశారు.


ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్ గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001 లోనే చేరి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో బండా శ్రీ‌నివాస్ చురుకుగా పాల్గొన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో ఆయ‌న‌ పనిచేశారు. ఇదే క్ర‌మంలో ఈట‌ల‌కు స‌న్నిహ‌తంగా ఉంటూ అనుచ‌రుడిగా మారాడు.  



వీళ్లే కాకుండా ఈటల అనుచరులుగా ఉన్న చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు త‌న‌ను వీడి టీఆర్ఎస్ వైపు వెళ్లిపోతుండం ఈటల రాజేంద‌ర్‌ను అసౌకర్యానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో త‌గిన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని ఈట‌ల భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈట‌లకు ఉన్న బ‌లాల‌ను, అనుచ‌రుల‌ను దూరం చేయ‌డానికి టీఆర్ ఎస్ నాయ‌కులు శ్ర‌మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: