ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. గతంలో ఇల్లు కట్టాలన్నా... పెళ్లి చేయాలన్నా కూడా అదో పెద్ద ప్రస్తానం. ప్రతి చిన్న పని స్వయంగా దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. అయితే డబ్బు ఉంటే అదేం పెద్ద కష్టం కాదనేది నేటి మాట. డబ్బులుంటే... వారం రోజుల్లో పెళ్లి.. నెల రోజుల్లో ఇల్లు పూర్తవుతుంది. కానీ డబ్బు లేని నిరుపేదలకు మాత్రం ఇంట్లో శుభకార్యం అంటే అదో పెద్ద కలగానే ఉండిపోతుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తోంది. చివరికి గుడిలో వివాహానికి కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే. అలాంటి వారి కోసమే అన్నవరం దేవస్థానం వినూత్న ఆలోచన చేసింది. పైసా ఖర్చు లేకుండా కొండపై వివాహతంతు ముగించుకునేందుకు ఉచిత కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన అన్నవరం దేవస్థానం.

ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలు జరిగేలా కొండపై కల్యాణ మండపాన్ని దేవస్థానం బోర్డు నిర్మించింది. దాతల సహకారంతో శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం నిర్మించిన దేవస్థానం... దీనిని ఈ ఏడాది ఆగస్టు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రావణమాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు కూడా మొదలు పెట్టేసింది. రత్నగిరిపై వివాహం జరిగితే భవిష్యత్తు బంగారంలా ఉంటుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఖర్చును భరించలేని వారు కూడా రత్నగిరిపై తంతు ముగించేందుకు వస్తుంటారు. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున భక్తులు సత్యదేవుని సన్నిధికి వచ్చి కల్యాణ తంతు పూర్తి చేసుకుంటారు.
 
ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండే వారి కోసం దేవస్థానం వినూత్న ఆలోచన చేసింది. శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్ సంస్థ యాజమాన్యం సహకారంతో కలిసి రూ.3.5 కోట్లతో అత్యాధునిక వసతులతో ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఒకేసారి 12 జంటలకు అనుకూలంగా ఈ వేదికను నిర్మించారు. మండపం కేటాయింపులో పేదలకే అగ్రస్థానమని ఆలయ ఈవో ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 16న మండపం ప్రారంభించారు. ఈ మండపం శ్రావణ మాసం బుకింగ్ పూర్తిగా ఫుల్ అయినట్లు ఆలయ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: