కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాటల యుద్ధం కాస్తా... పరస్పర దాడులకు కారణమైంది. నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడా జరగటం లేదని... అలాగే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించడం లేదని... కృష్ణా జలాలు వృధాగా పోతున్నాయంటూ... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా నిత్యం ఆరోపణలు సంధిస్తూనే ఉన్నారు. అటు దేవినేనిపై కూడా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఘాటుగానే విమర్శలు చేశారు. జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సాగర్ కాలువ ఆధునీకరణ పనుల పేరుతో దేవినేని ఉమా 20 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కూడా ప్రభుత్వానికి లేఖలు రాశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

అయితే తాజాగా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని రుజువు చేస్తామని కూడా టీడీపీ నేతలు సవాల్ చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు దేవినేని ఉమా స్వయంగా వెళ్లారు. ఆ ప్రాంతాన్ని టీడీపీ కార్యకర్తలతో కలిసి పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణమైన దేవినేని కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ వద్ద వైసీపీ నేతలు అడ్డుకున్నారు, మా గ్రామానికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. వాహనాన్ని చుట్టుమట్టి దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో దేవినేని ఉమా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పలువురు టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా గాయలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉనట్లు సమాచారం. అటు ఉమాపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు పెద్ద ఎత్తున గడ్డమణుగ చేరుకున్నారు. దీంతో ఏ నిమిషాన ఏం జరుగుతుందో అని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తనను హత్య చేసేందుకే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్లాన్ చేశారని దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: