టీడీపీ అధినేత చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం అందుకోవాలంటే ఏం చేయాలి? అంటే కేవలం జగన్‌పై ఫోకస్ చేయకుండా పార్టీని బలోపేతం చేస్తే అధికారం దక్కించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలని పుంజుకునేలా చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని చెబుతున్నారు. అసలు బాబుకు అధికారంలోకి రావడానికి అదొక్కటే చివరి ఆశ అని మాట్లాడుతున్నారు.

ఎందుకంటే బాబు అధికారం కోల్పోయి, ప్రతిపక్షానికి పరిమితమై రెండేళ్ళు గడిచాయి. మరి ఈ రెండేళ్లలో చంద్రబాబు పార్టీని ఏ మేర బలోపేతం చేశారు? నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఏ మేర పుంజుకున్నారు? అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ రెండేళ్లలో బాబు చేసిన పని ఒక్కటే...అది కేవలం జగన్‌పై విమర్శలు చేయడమే...నిత్యం జగన్‌పై ఏదొక రూపంలో విమర్శలు చేయడం చంద్రబాబు పని.

జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి...జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేయాలి. అది కూడా మీడియా, సోషల్ మీడియాల్లోనే. ఇక అధినేత అదే బాటలో ఉంటే మిగిలిన నేతలు ఏం చేస్తారు...వారు కూడా అలాగే జగన్ ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇలా రెండేళ్లుగా చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్న రచ్చ. మరి ఇలా చేస్తే టీడీపీ బలోపేతం అయిపోతుందా? అంటే అవ్వలేదనే స్థానిక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

మరి అలాంటప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? జనాల్లోకి రావాలి...వారి సమస్యలు తెలుసుకోవాలి..సమస్యలపై పోరాటం చేయాలి...ప్రజలకు అండగా నిలబడాలి. నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలు ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. అక్కడ ఉండే స్థానిక సమస్యలపై ఫైట్ చేయాలి. అలా చేసుకుంటూ వెళితేనే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీకి కొంచెం గెలిచే అవకాశాలు మెరుగుపడతాయి. అలా కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు...జగన్‌నే విమర్శించకుంటూ వెళ్ళడం వల్ల పావలా ప్రయోజనం లేదనే చెప్పొచ్చు. కాబట్టి ఇకనుంచైనా బాబు ఆ విధంగా ముందుకెళితే, నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం అందుకోవచ్చు..లేదంటే అంతే సంగతులు.


మరింత సమాచారం తెలుసుకోండి: