వాటర్ పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ సారి తెలుగు రాష్ట్రాల మధ్య కాదు. సొంత రాష్ట్రంలోనే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్ ద్వారా కృష్ణా నీటిని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగు నీరు అందించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు వెలుగొండ. దాదాపు 15 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద రెండు సొరంగమార్గాలను తవ్వతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను టన్నెల్స్ ద్వారా మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి టన్నెల్ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. అటు రెండో టన్నెల పనులు కూడా తుది దశకు చేరుకున్నాయనే చెప్పాలి. ఈ సమయంలో మొదటి టన్నెల్ లోకి నీరు పెద్ద ఎత్తున లీక్ అవ్వడంపై అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.
 
దోర్నాల మండలంలోని కొత్తూరు సమీపంలో మొదటి సొరంగం దగ్గర ఏర్పాటు చేసిన రెగ్యులేటర్ నుంచి వరద నీరు లీకేజ్ అవుతోంది. టన్నెల్  ప్రదేశాన్ని పరిశీలించిన తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నేతలు పనుల్లో నిర్లక్ష్యం కారణఁగానే వాటర్ లీకేజీ జరుగుతుందని ఆరోపించారు. కనీస జాగ్రత్తలు కూడా ప్రభుత్వం పాటించలేదని... దీని వల్ల టన్నెల్ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించిన వారిలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి సహా పలువురు నేతలున్నారు.

అయితే టీడీపీ నేతలు ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొట్టిపారేశారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఏదో జరిగినట్లు టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. టన్నెల్ లోనికి నీళ్లు వస్తున్నాయంటే... పనులు పూర్తవుతున్నాయనే విషయం గమనించాలన్నారు. హెడ్ రెగ్యులేటరీ వద్ద గేట్ లకు వేసిన రబ్బర్ సీల్స్ నుంచి కొంత లీకేజ్ వచ్చిందన్నారు. వాటిని విశాఖపట్నం నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించి... లీకేజీని అరికట్టినట్లు మంత్రి వెల్లడించారు. టన్నెల్ లో ఉన్న నీటిని రెండు రోజుల్లో పూర్తిగా బయటకు తోడేస్తామన్నారు. ఇప్పటికే 11  ముంపు గ్రామాల్లో 2 గ్రామాల ప్రజలను పూర్తిగా తరలించామన్నారు. మిగిలిన చోట్ల కూడా పునరావాస పనులు శరవేగంతో జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: