ఇప్పటి వరకూ సీఎం జగన్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలన్నిటీకీ దాదాపుగా ప్రజామోదం లభిస్తోంది. అమ్మఒడి వంటి ఆర్థిక సాయం నిరుపేదల చదువులకు బాగా ఉపయోగపడుతోంది. చేతి వృత్తులవారికి, ఇతర వర్గాల వారికి అందిస్తున్న ఆర్థిక భరోసా.. కరోనా కష్టకాలంలో ఆదుకుంది. అటు నాడు-నేడు పేరుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక మిగిలిందల్లా ఏపీలో ఆర్ అండ్ బి రోడ్ల వ్యవహారం. జిల్లాల్లో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి. అందులోనూ ఇటీవల వర్షాలకు మరింత గుంతలు తేలాయి. దీంతో ప్రయాణికులు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే తమ పనులకు వెళ్తున్నారు.

చంద్రబాబు హయాంలో రోడ్ల వ్యవస్థ బాగుండేది, జగన్ వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. జాతీయ రహదారుల్లో టోల్ వాతలు ఎక్కువైనా దాన్ని ఎవరూ తప్పించలేని పరిస్థితి. మరి జిల్లా రహదారుల పరిస్థితి ఏంటి..? రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే ఈ రోడ్లకి కూడా టోల్ వసూలు చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ప్రభుత్వం అంత సాహసానికి పూనుకోలేదు. కనీసం రోడ్లను కూడా బాగుచేయలేదు.

చంద్రబాబు హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ చెల్లింపులు కాకపోవడంతో.. కాంట్రాక్టర్లు వెనకగుడేస్తున్నారు. అందులోనూ జగన్ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న మొత్తం తమకు గిట్టుబాటు కాదని ఆగిపోయారు. ఎన్నిసార్లు రోడ్ల టెండర్లు పిలిచినా ఇదే పరిస్థితి. దీంతో అసలు పనులే ముందుకు సాగటంలేదు. దీంతో ఈ ఏడాదిలో దీన్ని సరికొత్తగా చేపడుతామంటున్నారు అధికారులు. 9వేల కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించేందుకు 2వేల కోట్ల రూపాయలకి పైగా నిధులు విడుదల చేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో 46వేల కిలోమీటర్ల ఆర్ అండ్ బి రహదారులున్నాయి. ఏటా సగటున ఇందులో 9వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, లేదా కొత్త రోడ్లను వేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండూ జరక్కపోవడంతో ఇప్పుడు రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఇప్పటికైనా వీటి గురించి ప్రభుత్వం పట్టించుకోకపోతే.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. జగన్ పై ప్రస్తుతానికి ఉన్న అతి పెద్ద తొలి కంప్లయింట్ ఇదే. రాష్ట్రంలో రోడ్లను బాగు చేయించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. నిధులు విడుదలయ్యాయి, అదిగో మొదలవుతాయి, ఇదిగో కొబ్బరికాయ కొట్టేస్తాం.. అనే డైలాగులు రెండేళ్లుగా వినపడుతూనే ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలప్పుడు పాక్షికంగా మట్టివేసి గుంతలు పూడ్చేస్తున్నారు. అయ్యవార్లు వెళ్లిపోయిన తర్వాత అంతా షరా మామూలే. ఇలాంటి రిపేరింగ్ వర్కులు ఆపేసి, శాశ్వతంగా రోడ్లు బాగు చేయించగలిగితేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆర్థిక సాయం ఇస్తున్నాం కదా, గతుకుల రోడ్లలో వెళ్లి యాక్సిడెంట్లయితే మాకేం సంబంధం లేదు అంటే మాత్రం ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: