సామాజంలో రోజురోజుకు క‌ల్తీ మాఫియా ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌జ‌లు వినియోగించే నిత్య‌వ‌స‌రాలు అన్నింటినీ క‌ల్తీ చేస్తున్నారు. క‌ల్తీకి కావేవి అన‌ర్హం అన్న విధంగా కొంద‌రు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పాల‌ను అమృతం త‌రువాత అమృతంలా చూస్తారు. ఎందుకంటే వాటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌యిన అన్ని విట‌మిన్లు ల‌భిస్తాయి. పాలు తాగితే బ‌లం వ‌స్తుంద‌ని మ‌న చిన్న‌ప్ప‌టి నుంచే పెద్ద‌లు చెప్పుకుంటూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు పాలు తాగుదామంటే భ‌యంగా ఉంది. ఎందుకంటే అవి అస‌లు పాలా.. క‌ల్తీ పాలా అని అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.



  చిన్న‌పిల్ల‌లు మొద‌లుకుని పెద్ద‌వారికి సైతం పాలు ఎంతో అవ‌సరం. చిన్న పిల్ల‌ల‌కు ఆక‌లి తీర్చ‌డానికి పాలు అత్యంత అనువైన ఆహార ప‌దార్థం, పెద్ద‌వాళ్ల‌కు పొద్దున లేస్తే కాఫీనో టీనో  తాగాల‌ని ఉంటుంది. ప‌ని చేసే వారికి చాయ్ లేకుంటే మ‌న‌సే ఒప్ప‌దు. అంత‌లా మానవుని జీవితంలో అవ‌స‌రంగా ఉన్న పాలను క‌ల్తీ మాఫియా వ్యాపారంగా మ‌లుచుకుంది. ఈ క‌ల్తీ మాఫియాను ఎన్ని సార్లు పోలీసులు అరెస్ట్ చేసినా, ఆ ముఠాలు మాత్రం స్థావ‌రాలు మార్చుకుంటూ క‌ల్తీ దందాను కొన‌సాగిస్తూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కిజ్ గూడలో కల్తీపాలను తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.


  కల్తీ పాల‌ను త‌యారు చేస్తున్న స్థావరం పై ఎస్ఓటీ పోలీసులు ఆక్మసికంగా దాడి చేశారు.  ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 లీటర్ల వంట నూనె ప్యాకెట్లు, 20 పాల పౌడర్ ప్యాకెట్లు, 2 మిక్సర్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాల దందా చేస్తోన్న ముఠా యాజమానిపై   యాచారం ఎస్ ఓటీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. పరారీలో ఉన్న నకిలీ కేటుగాడి కోసం గాలిస్తున్నారు.

ఇక్కడ నకిలీ పాల పౌడర్‌తో వేల లీటర్ల పాలు తయారు చేస్తూ ఏవో బ్రాండ్‌ల‌ పేరు పెట్టి ప్యాకెట్ల‌లో అందంగా త‌యారు చేసి గెదే పాలు అంటూ మార్కెట్ లో అమ్ముతున్నారు. భాగ్య‌నగ‌ర‌ శివారులోని యాచారం సమీపంలో ఈ దందా కొన్నేళ్లుగా యథేచ్ఛగా కొన‌సాగుతోంది. ఈ వ్య‌వ‌హారం న‌డుస్తున్న అధికారులెవ‌రూ స్పందిక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విధంగా క‌ల్తీపాల‌ను తాగితే అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌డం ఖాయం అని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి న‌కీలీ దందాలు చేసే ముఠాలు న‌గ‌రంలో చాలానే ఉన్నాయ‌ని వీటి ద్వారా ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు  అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: