కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ గా పేరున్న కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతపై దాడితో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలంగా వినిపిస్తున్న ప్రతిపక్ష గొంతుల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరు. తొలి నుంచి పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో జాప్యం సహా, కృష్ణా నీటి వినియోగంలో నిర్లక్ష్యం, అంతరాష్ట్ర జల వివాదాల అంశంలో వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ సర్కార్ ను నిలదీస్తూనే ఉన్నారు. అదే సమయంలో సొంత నియోజకవర్గం మైలవరంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అవినీతి చేస్తున్నారంటూ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

తాజాగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారంటూ... తీవ్ర ఆరోపణలు చేసిన దేవినేని... ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అయితే తిరిగి వస్తున్న సమయంలో దేవినేని ఉమాపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు టీడీపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని... దీని వెనుక ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై కేసు నమోదు చేయాలంటూ జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట దేవినేని ఉమా ధర్నా చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు కారులో కూర్చుని ఆందోళన కొనసాగించారు.

అయితే దాడి చేసిన వారిని వదిలివేసిన పోలీసులు.... ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై మాత్రం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం ప్రస్తుతం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. వాహనం అద్దాలు తొలగించి... దేవినేనిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి మాజీ మంత్రిని పెదపారుపూడి స్టేషన్ కు ఆ తర్వాత నందివాడ స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు ఇదే అంశం విమర్శలకు తావిస్తోంది. దాడి చేసిన వారికి బదులుగా బాధితులను ఎలా అరెస్ట్ చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో అరాచకమైన పాలన జరుగుతోందన్నారు మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. అయితే జి.కొండూరులో అలజడి సృష్టించారనే ఆరోపణలపైనే దేవినేని ఉమాను అరెస్ట్ చేసినట్లు డీఐజీ మోహన్ రావు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే దేవినేని ఆ ప్రాంతానికి వెళ్లి రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఏది ఏమైనా... కృష్ణా జిల్లా పాలిటిక్స్ రాష్ట్రంలో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: