క్షేత్ర స్థాయిలో బాగా ప‌నిచేయాల్సిన అధికారులు ముసుగు త‌న్ని నిద్దురోతున్నారు. మేము చెప్పింది ఒక‌టి మీరు చేసింది ఒక‌టి అన్న స్థాయిలో వీరు న‌డుచుకుంటున్నారు. దీంతో ప్ర‌తిరోజూ అనేక ఒత్తిళ్ల మ‌ధ్య ప్ర‌భుత్వం న‌డుపుతున్న జ‌గ‌న్ కు వీరి తీరు మ‌రో త‌ల‌నొప్పి అయింది. స‌రిగా ఉద్యోగాలు చేయ‌ని వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.అలానే కార్యాల‌య స్థాయి అవినీతి కూడా పెరిగిపోతోంది. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ఆయ‌న పాల‌న చేయ‌లేరు.. లేదా వీటిపై చ‌ర్య‌లు లేకుండా ఆయ‌న ఉండ‌లేరు.. ఈ ద‌శ‌లో ఆయ‌న తీవ్ర అస‌హ‌నం, అసంతృప్తిలో ఉన్నారు. పాల‌నా వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడ‌దామ‌న్న కార‌ణంతో ఆయ‌న చేసిన ప‌నులు లేదా చెప్పిన ప‌నులు ఏవీ సఫ‌లీకృతం కావ‌డం లేదు. ఒక‌వేళ గ‌ట్టిగా ప‌ట్టుబ‌డితే గ‌త సీఎం చంద్ర‌బాబులానే తానూ ఉద్యోగ వ్య‌తిరేకి అనిపించుకోవాల్సి వ‌స్తుంద‌న్న భ‌య‌మూ ఆయ‌న‌ను వెన్నాడుతోంది. ఇది ఇవాళ జ‌గ‌న్ ను వెన్నాడుతున్న కొత్త భ‌యం. ఈ భ‌యాన్నీ,ఆందోళ‌న‌నూ ఎలా జ‌యించాలి అన్న‌ది ఇప్ప‌టి ప్ర‌శ్న.

పాల‌న‌పై ప‌ట్టు పెంచుకోవాల‌నుకున్న ప్ర‌తిసారీ ఏదో ఒక అవాంత‌రం ఎదుర‌వుతూనే ఉంది ఆయ‌న‌కు..పాల‌న‌పై మ‌రింత స్ప‌ష్ట‌త పెంచుకోవాల‌న్న‌ది ఆయ‌న కోరిక..కానీ అందుకు అనుగుణంగా ప‌రిస్థితులు లేవు.. ఫ‌లితంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌రుచూ అసంతృప్తికి లోన‌వుతున్నారు. తాను ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని చెబుతున్నా ప‌దే ప‌దే అదే మాట వినిపిస్తున్నా అధికారుల‌కు మాత్రం ఇది ప‌ట్ట‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఇక‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని అంటున్నారు ఆయ‌న. కానీ ఉద్యోగులు మాత్రం మ‌రో వాద‌న వినిపిస్తున్నారు. తమపై అన‌వ‌స‌ర ఒత్తిడి పెంచ‌కూడ‌ద‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. క‌రోనా వేళ తాము ప్రాణాలను సైతం లెక్క చేయ‌క ప‌నిచేస్తున్నామ‌ని చెబుతున్నారు. కానీ వాస్త‌వం ఏంట‌న్న‌ది నిన్న‌నే తేలిపోయింది. గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌రివేక్షించాల‌ని అధికారుల‌ను ఆదేశించినా సీఎం మాట‌కు విలువే లేకుండా పోయింది. దీంతో క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు సై అంటున్నారు  సీఎం. ఇదే కాదు తాను ఏ ప‌ని చెప్పినా క్షేత్ర స్థాయిలో అది అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని, అందుకు కార‌ణాలు ఏమ‌యినా ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం పోతుంద‌న్న బాధ‌లో ఉన్నారు జ‌గ‌న్.

మరింత సమాచారం తెలుసుకోండి: