క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక రానుంది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన వైసీపీ నాయ‌కుడు.. డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య అకాల మ‌ర‌ణంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇది వైసీపీకి కంచుకోట‌. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం.. వైసీపీకి అనుకూలంగా మారింది. ఈ క్ర‌మంలో టీడీపీ ఇక్క‌డ గెలిచి చాన్నాళ్లే అయింది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డ‌మా?  లేక‌.. వ‌దులుకోవ‌డ‌మా? అనే చ‌ర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. వ‌దులుకుంటే.. సానుబూతి వ‌స్తుంద‌ని.. త‌ద్వారా.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసుకుని పార్టీని బ‌లోపేతం చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కొంద‌రు సీనియ‌ర్లు చెబుతున్నారు.

``కేవ‌లం రెండున్న‌రేళ్ల కోసం.. ఇక్క‌డ ప్ర‌య‌త్నం చేయ‌డం కంటే.. వ‌దులుకుని సానుభూతిని సొంతం చేసుకుంటే..రాష్ట్ర వ్యాప్తం గా పార్టీని బ‌లోపేతం చేసుకునే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని.. మా భావ‌న‌`` అని విజ‌య‌వాడ‌కు చెందిన ఒక సీనియ‌ర్ నాయ‌కుడు చెప్పారు. ఇదే అభిప్రాయం ప‌లువురు సీనియ‌ర్లు కూడా వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆయ‌న అన‌డాన్ని బ‌ట్టి.. బ‌ద్వేల్‌పై టీడీపీలో బాగానే చ‌ర్చ సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో వ‌దులుకుంటే.. తిరుప‌తిలో ఎందుకు పోటీ చేశారు.. అక్క‌డ కూడా ఇదే సంద‌ర్భంగా(అంటే.. ప్ర‌జాప్ర‌తినిధి మ‌ర‌ణంతో) ఉప ఎన్నిక జ‌రిగింది క‌దా.. ఇక్క‌డ ఓడిపోతార‌నే ఉద్దేశంతోనే టీడీపీ వెనక్కి త‌గ్గింద‌నే విమ‌ర్శ‌లు వచ్చే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు సీనియ‌ర్లు హెచ్చరిస్తున్నారు.

దీనిని ప‌రిశీలిస్తున్న పార్టీ అధిష్టానం.. అన్ని కోణాల్లోనూ బ‌ద్వేల్‌పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. పోటీ చేయ‌డ‌మా?  వ‌ద్దా.. అనే విష‌యంపై ఇప్ప‌టికీ.. నిర్ణ‌యం తీసుకోలేదు. పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కడం క‌ష్ట‌మ‌ని.. మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు. క‌డ‌ప‌లో ఇప్పుడు వైసీపీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని.. ఇక్క‌డ రాష్ట్రంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా.. అభివృద్ధి చేప‌డుతున్నార‌ని.. సో.. ఇప్పుడు క‌నుక బ‌ద్వేల్‌లో పోటీ చేసినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. పార్టీలోని ఓవ‌ర్గం చంద్ర‌బాబుకు చెబుతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ముందు నుంచి వ్యూహాత్మ‌కంగా దీనిపై దృష్టి పెడితే.. చంద్ర‌బాబు సైతం తిరుప‌తిలో ప్ర‌చారం చేసిన విధంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తే.. తిరుగు ఉండ‌ద‌ని.. మ‌రికొంద‌రు అంటున్నారు. దీంతో బ‌ద్వేల్ ఉప పోరుపై ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంలో చంద్ర‌బాబు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: