మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై దాడి.. ఆ తర్వాత ఆందోళనలు, అరెస్టులు... ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు దేవినేనిపై ఎందుకు దాడి జరిగింది... ఎవరు చేశారు... ఎలా చేశారు... కారణమెవరు... అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా పలు ఆరోపణలు చేశారు. ఇందులో ప్రధానమైనది కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ తవ్వకాలు. ఇక్కడ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని దేవినేని ఆరోపించారు. ఇందులో భాగంగానే నిన్న కొంండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పర్యటించిన దేవినేని ఉమా... అక్కడ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. కొండపల్లి ప్రాంతంలోనే మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి... ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని టీడీపీతో పాటు దేవినేని ఉమాకు చెందిన సోషల్ మీడియాలో కూడా లైవ్ ఇచ్చారు.

తమ నేతపై ఆరోపణలు సహించని కొంతమంది వైసీపీ కార్యకర్తలు... తిరుగు ప్రయాణంలో ఉన్న దేవినేని కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు ప్రత్యక్షసాక్షుల మాట. వాదనలు శ్రుతి మిుంచడంతో దేవినేని ఉమా వాహనంపై కొందరు రాళ్ల దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి నుంచి మాజీ మంత్రిని కాపాడింది కూడా వైసీపీ నేతలే అని తెలుస్తోంది. దాడి చేస్తున్న తమ పార్టీకి చెందిన కార్యకర్తలను కొందరు స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు దేవినేనికి రక్షణగా నిలిచి... తమ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నట్లుగా తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా వైసీపీ నేతలు బయటపెట్టారు. ఇరువర్గాల నేతలు భారీగా మోహరించిన సమయంలో జి.కొండూరుకు చెందిన వైసీపీ నేతలు పాలడుగు దుర్గాప్రసాద్ సహా మరికొందరు నేతలు అడ్డుగా నిలిచారు. ఈ దాడిలో దుర్గాప్రసాద్ వాహనం కూడా ధ్వంసమైందని స్థానిక వైసీపీ నేతలు వెల్లడించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు కాబట్టే... వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని... అయితే ఈ దాడిని వైసీపీ సీనియర్ నేతలే అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: