దేవినేని ఉమ‌పై వైసీపీ మైలవరం ఎమ్మెల్యే శ్రీ వల‌సంత కృష్ణ ప్రసాద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు, అల్లర్లు ప్రేరేపించేందుకు పనీపాటలేని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా త‌న‌పై, ప్రభుత్వంపైన విష ప్రచారాలు మ‌రియు దుష్ప్రచారాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంబంధం లేని అంశాలతో చెత్తాచెదారం అంతా తీసుకొచ్చి, గాలి పోగేసి, వాటిని త‌న‌తో పాటు ప్రభుత్వానికి ఆపాదిస్తూ నిత్యం నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నార‌ని అన్నారు. రక్షిత అటవీ ప్రాంతమైన కొండపల్లి కొండల్లోకి ఇప్పటి వ‌ర‌కు 15 సార్లు వెళ్ళి.. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని.... దాన్ని త‌న మీద‌ రుద్ది, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నార‌ని చెప్పారు.

తాను ఆశించింది జరగకపోవడంతో ప్రజలను రెచ్చగొట్టయినా నియోజకవర్గంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొండపల్లి ప్రాంతంలో  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇప్పించిందీ ఆయ‌నేన‌ని అన్నారు. అంతే కాకుండా అప్పుడు రెవెన్యూ భూములని చెప్పి ప్రారంభోత్సవాలు చేసింది కూడా అతనేన‌ని అన్నారు. ఇప్పుడు అవి ఫారెస్ట్ భూములంటాడ‌ని చెప్పారు. అధికారంలో ఉంటే ఒక మాట, పోయాక మరో మాట మాట్లాడుతున్నది దేవినేని ఉమానే అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దుగ్గిరాలపాడు, మరో చోట త‌న‌కు సంబంధం లేకపోయినా, వాటిని కూడా త‌న‌కు ఆపాదించడం,  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లాంటివి చేస్తున్నార‌ని చెప్పారు.

తన అనుకూల మీడియాలో తప్పుడు వార్తలు రాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తుండ‌టంతో వైసీపీ కార్యకర్తలు మ‌రియు ఆ ప్రాంత ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. ఈరోజు కూడా అట‌వీ ప్రాంతానికి వెళ్లి అదే దుష్ట రాజ‌కీయం చేయాల‌ని చూసిన దేవినేని ఉమాను ప్ర‌శ్నించేందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు వెళ్లార‌ని తానే న‌చ్చ‌జెప్పి వెన‌క్కి రప్పించాన‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా ఉమా ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని హిత‌వుప‌లికారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాల‌ని ఏది ప‌డితే అది మాట్లాడి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టాని చూస్తూ ఊరుకోర‌ని వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందు దేవినేని ఉమా నాట‌కాలు, డ్రామాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌నివి కావంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: