ప‌ద ప‌ద‌వే వ‌య్యారి గాలి ప‌ట‌మా..


మ‌తాన్ని న‌మ్ముకుని పార్టీలు కేవ‌లం ప్ర‌జ‌ల సెంటిమెంట్ల ఆధారంగా న‌డిపే పార్టీలు ముఖ్యంగా బీజేపీ,ఎంఐఎం .. బీజేపీ హిందు త్వాన్ని న‌మ్ముకుంటే ఎంఐఎం ముస్లిం వాదాన్ని ప్ర‌చారం చేస్తుంది. ముస్లింలో  అభ‌ద్ర‌తత‌ను త‌న‌కు అనుగుణంగా మార్చుకునేం దుకు రాజ‌కీయంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంది. అంతేకానీ ముస్లీం యువ‌త కోసం, దేశ దాటి పోతున్న మ‌హిళ‌ల కోసం  మాన‌వ అక్ర‌మ ర‌వాణా నివార‌ణ కోసం ఎంఐఎం ప‌నిచేసిన దాఖ‌లాలు లేవు.. అధికారం ఎవ్వ‌రి ద‌గ్గ‌ర ఉన్నా ఒకే విధం అయిన స్నేహ ధ‌ర్మం మాత్రం పాటిస్తుంద‌న్న విమ‌ర్శ అయితే ఉంది. పాల‌క ప‌క్షానికి బీ టీంగా ఉంటుంది ఎంఐఎం. ఈ అప‌వాదు ఇప్ప‌టికిప్పుడు అయితే తొల‌గ‌దు.. కొన్ని వివాదాస్ప‌ద చ‌ట్టాల విష‌య‌మై బీజేపీని వ్య‌తిరేకించినా అది కూడా కేవ‌లం రాజ‌కీయ ఎత్తుగ‌డే త‌ప్ప మ‌నస్ఫూర్తిగా చేసిన ప‌ని అయితే కాదు.. పార్టీలు పాల‌క శ‌క్తుల ప‌ల్ల‌కీలు మోయ‌డం మానుకుంటే మంచి నిర్ణ‌యాలు కొన్ని అమ‌లు చేసేలా ఉద్య‌మించ‌వ‌చ్చు.


కానీ ఎంఐఎం ఉద్య‌మ పార్టీ కాదు క‌దా క‌నుక ఆ ప‌ని చేయ‌దు. కేవ‌లం మ‌త ప్రాతిప‌దిక‌నే త‌న ఉనికిని కాపాడుకోవ‌డం ఒక అంతిమ సిద్ధాంతంగా మ‌లుచుకుంది. అప్పుడు ఆ దిశగా కాకుండా మ‌రో ర‌కంగా ఆలోచించేం దుకు ఛాన్సే లేదు. తెలంగాణ ఉద్య‌మంలో కూడా ఎంఐఎం వ్య‌తిరేకించింది ఒక్క రాయల తెలంగాణ అంశ‌మే త‌ప్ప మ‌రో విష‌య మై పెద్ద‌గా మాట్లాడింది లేదు. నిరుద్యోగ ముస్లీం యువ‌కుల కోసం చేసిందీ లేదు.. అన్యాక్రాంతం అవుతున్న ముస్లిం ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌నిచేసిందీ లేదు.. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ముస్లీం అయినా ఆయ‌న సాయంతో అయినా ముస్లింల కోసం చేసిన మంచి ప‌నులు ఏమీ లేవు.


ఎక్క‌డ‌యినా ఎప్పుడ‌యినా విద్వేష పూరిత ప్ర‌సంగాలే త‌ప్ప సామర‌స్య ధోర‌ణికి ప్రాధాన్యం ఇవ్వ‌ని నాయ‌కులకు చెందిన ఈ పార్టీకి అధికారం అందేది లేకున్నా అంద‌లం ద‌క్కేది లేకున్నా కొన్ని చోట్ల కీల‌క శ‌క్తిగా ప‌నిచేసిన రోజులున్నాయి. ఆ విధంగా అటు గులాబీ పార్టీతోనూ, ఇటు బీజేపీతోనూ స్నేహ బంధాలు ఉన్నాయి. నాటి వైఎస్సార్ కు అత్యంత చేరువులో ఉన్న పార్టీ కూడా ఎంఐఎంనే! పాత బ‌స్తీలో త‌న కంటూ ప్రాబ‌ల్యం పెంచుకున్న ఎంఐఎం క్ర‌మంగా ఇతర రాష్ట్రాల‌కూ ప్రాధాన్యం ఇచ్చి త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌హారాష్ట్ర, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి ప్రాంతాల‌లో త‌న స‌త్తా చాటుకునేందుకు పావులు క‌దుపుతుంది. అయితే తెలంగాణ‌లో కేసీఆర్ కు చేరువుగా ఉంటూ ఆయ‌నతో అనుబంధం కొన‌సాగించిన కార‌ణంగా పెద్ద‌గా టీఆర్ఎస్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు అయితే చేయ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: