విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకు గర్వకారణం. పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారం దేశంలో ఇదే కావడం ఒక విశేషం అయితే సాగర నగరంలో ఏర్పాటు అయిన ఏకైక ప్లాంట్ కూడా ఇదే అవడం మరో ప్రత్యేకత.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నాడు ప్రాణ త్యాగాలు చేశారు. దాదాపుగా అయిదేళ్ళ పాటు ముమ్మరంగా ఉద్యమం సాగింది. చివరికి కేంద్రం వద్దకు నాటి ప్రభుత్వ ప్రతినిధులు వెళ్ళి ప్లాంట్ ఏర్పాటు మీద కచ్చితమైన హామీపత్రాన్ని తీసుకుని వస్తే తప్ప ఉక్కు కొరకు చేస్తున్న ఆందోళనలను విరమించలేదు. ఇపుడు అదే స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ విషయంలో ఎక్కడా దాపరికం లేకుండానే పదే పదే ప్రకటిస్తోంది.

తాజాగా హై కోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్ లో కూడా ప్లాంట్ ని అమ్ముతామని చెబుతోంది. ఆర్ధికపరమైన వ్యవహారాలుగా వీటిని పేర్కొంటోంది. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంగానూ చెబుతోంది. ప్లాంట్ అమ్మకం, ఏర్పాటు వంటి వాటిలో ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కూడా స్పష్టం చేస్తోంది.

దీన్ని బట్టి తేలుతోంది ఏంటి అంటే పాలకులు తాము తీసుకునే నిర్ణయాలను ఎలాగైనా సమర్ధించుకుంటారని, అదే విధంగా ఆర్ధిక‌ అవసరాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవచ్చు అని కూడా కేంద్రం చెబుతున్నట్లుగా కూడా ఉంది. మరి ఇపుడు దేశంలోని అన్ని రాష్ట్రాలూ అప్పులతోనే ఉన్నాయి. వాటికి ఆర్ధిక అవసరాలు ఉంటాయి. మరి వారు కూడా కేంద్రం చెప్పిన బాటలోనే నడచి తమ పరిధిలో ఉన్న ఆస్తులను తెగనమ్ముకోవచ్చా. అదే పరిష్కారం, ఉత్తమ సందేశం అయితే మాత్రం ఎవరూ ఎవరినీ అడగనక్కరలేదు, అడ్డు కూడా చెప్పనక్కరలేదు. మొత్తానికి దేశ సంపద‌గా ప్రభుత్వ సంస్థలు ఉంటాయ‌నుకుంటే ఇపుడు పాలకుల అవసరాల మేరకు వాటి జాతకాలు నిర్ణయించబడుతున్నాయన్న మాట. ఏది ఏమైనా  ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక దేవాలయాలు అన్న మాట గతంలో ఉండేది. ఇపుడు ఏమైందో కూడా నవీన ప్రభువులు చెప్పాలేమో.





 

మరింత సమాచారం తెలుసుకోండి: