టిడిపి అధినేత చంద్రబాబు, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య ఎలాంటి సత్సంబంధాలున్నాయో అందరికీ తెలిసిందే. గతంలో రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో ఎంత సన్నిహితంగా మెలిగారో కూడా తెలుసు. అలాగే చంద్రబాబు కూడా రేవంత్‌కి అంతే ఫ్రీడం ఇచ్చేవారు. అయితే టిడిపిని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్ళినా సరే రేవంత్ రెడ్డి, ఎప్పటికప్పుడు చంద్రబాబు పై ఉన్న గౌరవాన్ని చాటి చెప్తూనే ఉన్నారు. పార్టీ మారినా సరే చంద్రబాబును ఒక్క మాట కూడా విమర్శించలేదు. పైగా టిడిపి వల్లే తనకు ఈ స్థాయి వచ్చిందని చెప్తుంటారు. అయితే ఇలాంటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టే రేవంత్ రెడ్డికి పిసిసి రావడానికి కారణం చంద్రబాబు అని ప్రత్యర్ధుల నుంచి విమర్శలు వచ్చాయి.

అలాగే రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు మనిషి అని మాట్లాడుతున్నారు. అయితే వారి మధ్య బంధం ఎలా ఉన్నా సరే, ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు. అటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ని  రేవంత్ లీడ్ చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తూ కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక విషయంలో మాత్రం రేవంత్ తన మాజీ బాస్ చంద్రబాబుని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.  

ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎప్పటికప్పుడు టిడిపి నేతలను, కార్యకర్తలను యాక్టివ్‌గా ఉంచడానికి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. అలాగే త్వరలోనే వైసీపీ అధికారంలో నుంచి దిగిపోతుందని మాట్లాడుతూ, నెక్స్ట్ అధికారంలో వచ్చేది మనమే అని చెప్తూ ఉంటారు. మొన్నటి వరకు జమిలి ఎన్నికలు వస్తున్నాయని, ఇక జగన్ ప్రభుత్వానికి టైం దగ్గర పడింది అని మాట్లాడుతూ ఉండేవారు.  అయితే ఇలా మాట్లాడటం వల్ల కార్యకర్తలు, నేతలకు కాస్త ఉత్సాహం వచ్చి, ఇంకా పార్టీ తరఫున ఎక్కువగా పని చేస్తారు.


ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు వస్తాయని, అప్పుడు కెసిఆర్ గద్దె నుంచి దిగుతారని, ఆ తర్వాత వచ్చేది సోనియమ్మ రాజ్యమే అని చెబుతూ కార్యకర్తలని ఉత్సాహపరిచే కార్యక్రమం చేస్తున్నారు. అయితే త్వరగా ఎన్నికలు వస్తాయా? ఎన్నికలు వచ్చినా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు గద్దె దిగుతాయా? అనే విషయం చెప్పలేకపోయినా కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహ పరచడానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: