హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఈ పథకం అమలుకోసం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా నిర్ణయించడం మరింత చర్చనీయాంశం అయింది. ఈ పథకం ద్వారా దళిత ఓటుబ్యాంకుని ఒడిసిపట్టుకోవాలనేది కేసీఆర్ ప్లాన్. అయితే ఆయన ప్లాన్ కు అడ్డుకట్ట పడే ఛాన్స్ ఉంది. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలయ్యే వరకు ఈ పథకం అమలుని ఆపేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

ప్రతిపక్షాలు అంత ధైర్యం చేస్తాయా..?
గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కేసీఆర్ సర్కారు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆ పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత తప్పంతా ప్రతిపక్షాలపైకి నెట్టేసింది ప్రభుత్వం. ఆర్థిక సాయం అందకుండా చేశాయంటూ ప్రజల్ని రెచ్చగొట్టింది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంతుంది అనే విషయాన్ని పక్కనపెడితే, ఎన్నికల పేరుతో ప్రజలు ఆర్థిక సాయం అందక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు దళిత బంధు విషయంలో కూడా ప్రతిపక్షాలు ఆ పని చేస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే దళితబంధు ఎన్నికల పథకం అని విమర్శిస్తున్నా.. దాన్ని ఆపేయండి అనే సాహసం చేయలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ప్రతినిధులు సీఈసీకి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్న కేసీఆర్, దళితులకు తమ ప్రభుత్వం కంటే ఎవరూ గొప్ప మేలు చేయలేదని అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలకోసమే ఈ పథకం తెరపైకి తెచ్చారని, ఇప్పటి వరకూ దళితులకోసం కేసీఆర్ చేసింది శూన్యం అని ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై దళితుడ్ని కూర్చోబెడతానని చెప్పి మాటతప్పిన కేసీఆర్, ఇలాంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఆయన్ని ప్రజలు నమ్మరని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలో దళితబంధుపై కేసీఆర్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎన్నికల సంఘం కొత్త పథకాలపై, అందులోనూ హుజూరాబాద్ ని వేదికగా చేసుకోవడంపై అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: