కొన్ని కొన్ని నిర్ణ‌యాల‌కు నేత‌ల‌కు అనూహ్యంగా ఎదురు తిరుగుతాయి. ఇలాంటిదే ఇప్పుడు చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌. బాబు విష‌యంలోనూ జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం జ‌గ‌న్ కొంద‌రు స‌ల‌హాదారులు తీసుకున్న నిర్ణ‌యం..బాబు మెడ‌కు చుట్టుకుంద‌ని అటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని ప్ర‌ముఖ‌.. కాణిపాకం ఆలయ చైర్మన్‌గా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నేతను నియమించారు. అయితే.. స్థానికంగా ఉన్న‌వారికి ఈ నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని.. దీనికి ఎమ్మెల్యేనే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ.. కొంద‌రు ఇప్పుడు ఆయ‌న కేంద్రంగా వివాదం రేపుతున్నారు.

ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు ఆల‌య ఉభయదాత‌ల నుంచి కార్యకర్తల నుంచి కూడా నిరసన సెగ తప్పడం లేదు.  గతంలోనే స్ధానిక  ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు స్ధానికేతరులను కాణిపాకం కమిటీ చైర్మన్‌గా  ఓ మహిళను నియమించాల‌ని నిర్ణయించుకోవడంతో ఆలయ ఉభయదాత‌ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోన్నారు. అప్పట్లో అసమ్మతి ఎదురుకావడంతో  బాబు తన నిర్ణయాన్ని విరమించుకోక తప్పలేదు. తీరా ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏకంగా  ఉభయదాత‌లకు, స్థానిక నేతలకు కాకుండా నాన్ లోకల్‌కు చెందిన మహిళకు పదవి కట్టబెట్టడంతో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

దీంతో ఎమ్మెల్యేకు ఎటూ చెప్పలేని పరిస్థితి ఎదురవుతోందట. తన మనుషులకు పదవి ఇప్పించుకోలేక పోవడం ఒక రకమైన ఫెయిల్యూర్‌ అయితే నియోజవర్గంలో ఇతరుల పెత్తనం ఎమ్మెల్యే సత్తాకు సవాల్‌గా మారింద‌నే టాక్ వినిపిస్తోంది.  వైసీపీ హైకమాండ్ ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉభయదాత‌లను నియమించకపోవడంపై నియోజవర్గం వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పోరుబాట చేయాలని నిర్ణయించుకున్నారట.  చైర్మన్‌ ఎంపిక విషయంలో తమను పట్టించుకోకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

చైర్మ‌న్ ఎంపిక‌లో సంప్రదాయాన్ని మార్చార‌నే విష‌యం ఎమ్మెల్యేకు తెలిసినా.. మౌనంగా ఉండ‌డాన్ని వారు స‌హించ‌లే క‌పోతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 14 గ్రామాల్లో ఉన్న కాణిపాకం ఉభయదాత‌లు ఏకతాటిపైకి వచ్చి న్యాయపోరాటం చేయాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.దీంతో పూతలపట్టు వైసీపీలో పరిస్థితి అగమ్య గోచ‌రంగా మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.  మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: