ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజుల్లో మరణాలు 21శాతం.. కేసులు 8శాతం పెరిగాయని వెల్లడించింది.యూరప్ మినహా అన్ని దేశాల్లో కరోనా మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 19.5కోట్లకు చేరాయని తెలిపింది. అమెరికా, బ్రెజిల్, భారత్, బ్రిటన్ ఇండోనేషియాలో అత్యధిక కేసులు వస్తున్నాయని వివరించింది.

అమెరికా సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.. ఒక్కరోజే 61వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో పక్కాగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ మొదలయ్యాక తొలిసారి టోక్యోలో 3వేల 177కేసులు వచ్చాయి. సిడనీలో నెలపాటు లాక్ డౌన్ పొడిగించారు. సౌత్ కొరియాలో అత్యధికంగా 1,896కేసులు రాగా.. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో నెటిగివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు.

ఇక కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా మూలాలున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో గేదె మాంసం దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఓ ప్రైవేట్ సంస్థ పంపించిన ఐదు కంటైనర్లలోని మూడింటిలో వైరస్ గుర్తించినట్టు పేర్కొంది. ఆ మాంసాన్ని నాశనం చేస్తోంది.

మరోవైపు మహారాష్ట్రలో ముంబైలో సరికొత్త కరోనా కేసు బయటపడింది. ఒక మహిళా డాక్టర్ మూడుసార్లు కరోనా బారిపడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ సృష్టి హలారీకి కరోనా సోకింది. ముంబైలోని ములాండ్ ప్రాంతానికి చెందిన ఆమెకు తాజాగా కరోనా సోకడంతో.. శాంపిల్స్ సేకరించారు. కొత్త వేరియంట్ ఏమైనా సోకిందా.. అని పరీక్షలు చేయనున్నారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆమెకు రెండు సార్లు కరోనా సోకింది. ఇటీవల కరోనా వైరస్ భయం జనానికి పోయిందనే చెప్పాలి. కనీస జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే కొంప ముంచుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: