ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ రౌండ్ వేస్తే..అసలు ఈ నగరంలో కొన్నాళ్ల క్రితం కరోనా వచ్చిందా అన్నట్టుగా తయారైంది. జనం కరోనా గురించి కంగారు పడటం మానేశారు. మాస్కులు పక్కకు పెట్టేసారు.. షాపింగ్ జోరు పెంచేశారు. విందులు, వినోదాలు పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో కరోనా క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం తాజాగా వెలువడిన అనేక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మళ్లీ హైదరాబాద్‌లో కరోనా విజృంభించి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయేమో అనిపిస్తోంది.


క్రమంగా హైదరాబాద్‌లో మళ్లీ వైరస్ విస్తరిస్తోంది. తాజాగా గాంధీ ఆసుపత్రికి రోజూ 30కిపైగా కేసులు వస్తున్నాయి. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో 361 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇవి కాకుండా ఇంకా టిమ్స్‌, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనం తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే మరోసారి కరోనా విజృంభించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.


ఇటీవల హైదరాబాద్‌లో పుట్టినరోజు వేడుకలు, పెళ్లిల్లు, మ్యారేజ్‌డేలు.. అంత్యక్రియలు.. ఇలా అన్ని కార్యక్రమాలకు జనం బాగా హాజరవుతున్నారు. జనం గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా వ్యాపిస్తోంది. ఇటీవల కూకట్‌పల్లిలో ఒకే రోజు 11 మందికి కరోనా వచ్చింది. మెహిదీపట్నంలో వారం రోజుల క్రితం 12 మందికి కరోనా వచ్చింది. సికింద్రాబాద్‌లోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో వారం రోజుల్లోనే కొత్తగా 10 కేసులు వచ్చాయి.


జనం కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలా మళ్లీ కరోనా పెరుగుతోంది. రెండో ఉద్ధృతి తర్వాత తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కేసులు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మూడో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ప్రభుత్వపరంగా హెచ్చరికలు జారీ చేస్తున్నా జనం పట్టించుకోవడం లేదని అధికారులు అంటున్నారు. ఎంత చెప్పినా వినకపోతే.. మరోసారి హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని దుస్థితి మరోసారి వచ్చినా ఆశ్చర్యం లేదేమో.. జాగో హైదరాబాదీస్..


మరింత సమాచారం తెలుసుకోండి: